ఎట్టకేలకు టీడీపీ నేత, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అభ్యర్థి పనబాక లక్ష్మి రంగంలోకి దిగారు. ఈ నెల 24వ తేదీన తిరుపతి ఉప ఎన్నిక కోసం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నట్లు ప్రకటించారు. వెంటకగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తిరుపతి ఎంపీగా తనను గెలిపిస్తే, రాష్ట్ర ప్రజల వాణిని బలంగా లోక్‌సభలో వినిపిస్తానని చెప్పారు.
పలువురు మాజీ మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాగైతేనేం, పనబాక లక్ష్మి.. టీడీపీ తరఫున మాట్లాడటంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. పనబాక లక్ష్మి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని టీడీపీ అధిష్టానం ప్రకటించి చాలా రోజులే అయ్యింది. నిజానికి, ఈ ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. అధికార వైసీపీని టీడీపీ ఓడిస్తే, రాష్ట్రంలో టీడీపీ ఇమేజ్ అనూహ్యంగా పెరుగుతుంది. గెలవడం సంగతి తర్వాత, గట్టి పోటీ ఇచ్చేలా అయినా ముందు నుంచీ సన్నాహాలు చేసుకుని వుండాల్సింది. అనేక కారణాలతో పార్టీ కార్యకర్తలకు పనబాక లక్ష్మి ఇప్పటిదాకా అందుబాటులో లేకుండా పోయారు.
‘తిరుపతి లోక్ సభ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారుగానీ.. పార్టీ శ్రేణులకు అందుబాటులో లేరు.. ఇప్పుడే ఇలా వుంటే, రేప్పొద్దున్న గెలిచి, పార్టీకి ఆమె చేసేదేంటి.?’ అనే ప్రశ్న ఉత్పన్నమయ్యింది టీడీపీ శ్రేణుల్లో. ఇక, తిరుపతి ఉప ఎన్నిక బరిలో వైసీపీ, సిట్టింగ్ ఎంపీ కుటుంబం నుంచి కాకుండా, తనకు అత్యంత సన్నిహితుడైన డాక్టర్ గురుమూర్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బరిలోకి దింపుతున్న విషయం విదితమే. బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. జనసేన మద్దతుతో తమ అభ్యర్థిని గెలిపించుకుంటామని బీజేపీ చెబుతోంది.. ఈ మేరకు ఇప్పటికే తనదైన మైండ్ గేమ్ మొదలు పెట్టేసింది బీజేపీ. బీజేపీ అయినా, టీడీపీ అయినా రెండో స్థానానికే పోటీ పడాలన్నది వైసీపీ చెబుతున్న మాట.