హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లీక్ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఓ మహిళతో అసభ్యకరమైన రీతిలో న్యూడ్ కాల్ మాట్లాడారన్నది గోరంట్ల మాధవ్ మీద వచ్చిన రాజకీయ ఆరోపణ. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, అది ఫేక్ వీడియో అని.. ఆ వీడియో వచ్చిన వెంటనే ఖండించారు గోరంట్ల మాధవ్.
అయితే, నిపుణులు కొందరు.. అది ఫేక్ వీడియో అయ్యేందుకు అవకాశాలు తక్కువనడంతో.. వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఫేక్ కాదు ఒరిజినల్ అని తేలితే, గోరంట్ల మాధవ్ మీద చర్యలు తీసుకుంటామని వైసీపీ కూడా ప్రకటించింది. ఈ ఘటనలో విచారణ షురూ అయ్యింది. గోరంట్ల మాధవ్ అనుచరుడొకరు చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పోలీసులు, ఆ వీడియో ఒరిజినల్ కాదని తేల్చారు.
ఒరిజినల్ కాకపోత ఫేక్ వీడియో అనుకోవచ్చా.? అంటే, దానిపై మళ్ళీ స్పష్టత లేదు. ఎందుకంటే, మొబైల్‌లో ప్లే అవుతున్న వీడియోని చిత్రీకరించారు ఇంకో సాధనం ద్వారా. దాంతో, ఒరిజినల్ వీడియో బయటకు వస్తే తప్ప అది ఫేక్ అనిగానీ, ఒరిజినల్ అనిగానీ చెప్పలేని పరిస్థితి.
ప్రస్తుతానికైతే గోరంట్ల మాధవ్ ఊరట పొందారు. హోంమంత్రి తానేటి వనిత, గోరంట్ల మాధవ్ మీద రాజకీయ కుట్ర జరిగి వుండొచ్చు.. అని ప్రకటన చేసిన మర్నాడే, ఆయనకు ఈ వ్యవహారంలో ఊరట లభిస్తూ, ‘అది ఒరిజినల్ వీడియో కాదు’ అని ఎస్పీ ఫకీరప్ప ధృవీకరించడం గమనార్హం.
సాధారణంగా ఇలాంటి వీడియోలు మార్ఫింగ్ లేదా హనీ ట్రాప్ కేటగిరీలోకి వెళతాయి. హనీ ట్రాప్ జరిగిందేమోనన్న అనుమానాల్ని కొందరు వైసీపీ నేతలు కూడా మీడియా ముఖంగా వ్యక్తం చేసిన విషయం విదితమే.