ఎక్స్ ప్రెస్ టివి చైర్మన్ జయరాం హత్య కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. జయరాంను తానే చంపానని పోలీసుల విచారణలో రాకేష్ రెడ్డి ఒప్పుకున్నాడు. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా రాకేష్ విచారణలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
“మెదక్ లో జయరాంకు టెట్రాన్ పాలీలెన్స్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఆర్ధికంగా నష్టపోయింది. చెక్ పవర్ జయరాం భార్యకు ఉండడంతో ఆయన అప్పటకే పలువురి దగ్గర అప్పు చేశాడు. శిఖా చౌదరినే జయరాంను పరిచయం చేసింది. అప్పటికి నేను శిఖా డేటింగ్ లో ఉన్నాం. టెట్రాన్ కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు జయరాం నా దగ్గర 4.50 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు.
ఇంతలోనే శిఖాకు మరియు జయరాంకు మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. శిఖా నన్ను పెళ్లి చేసుకుంటానంది. కానీ జయరాంతో బంధం ఏర్పడ్డాక జయరాం శిఖాను వదిలివేయాలని కోరాడు. శిఖా నా దగ్గర నుంచి లక్షల రూపాయలు వృథాగా ఖర్చు పెట్టింది. దాదాపుగా శిఖాకు కోటిరూపాయల వరకు ఖర్చు చేశాను. నాకు రావాల్సిన నాలుగున్నర కోట్లతో పాటు శిఖాకు పెట్టిన కోటి రూపాయలు ఇస్తే వదిలేస్తానన్నాను. దానికి జయరాం ఒప్పుకున్నాడు. పలుసార్లు ఫోన్ చేసి పైసలు ఇవ్వాలని అడిగినా ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు.
జనవరి 29 న జయరాం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాడని తెలిసి హోటల్ కు వెళ్లాను. అక్కడి నుంచి జయరాంను తీసుకొని జూబ్లీహిల్స్ లోని మా ఇంటికి వచ్చాను. అక్కడ జయరామ్ కు నాకు గొడవ జరిగింది. దీంతో అతని పై రెండు పిడిగుద్దులు కొట్టాను. దీంతో అతను కిందపడిపోయి అక్కడే చనిపోయాడు. దీంతో నేను షాకయ్యాను.
అతనిని కావాలని చంపలేదు. ఆ తర్వాత బాడీని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉంచాను. సాయంత్రం కారులో వేసుకొని ఎవరికి అనుమానం రాకుండా నందిగామ వరకు తీసుకెళ్లాను. అక్కడ రోడ్డు పక్కకు కారులో వదిలి నేను హైదరాబాద్ కు బస్సులో తిరిగి వచ్చాను.” అని రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో తెలిపారు.
జయరాం చాలా విలాసవంతంగా తిరిగేవాడని తేలింది. అతను ఉంటున్న ఇల్లు కిరాయి నెలకు 4 లక్షల రూపాయలు. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా రాకేష్ రెడ్డి చలామణి అయ్యారు. ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బు వసూలు చేశాడని తెలుస్తోంది. సెటిల్ మెంట్లన్ని ఇంట్లోనే చేసి జల్సాలకు తిరిగేవాడని అమ్మాయిలను పడేసి వాడుకొని వదిలేయడమే అతని వృత్తిగా పెట్టుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది.