టిడిపి సీనియర్ నేత పార్టీ ఫిరాయించడంతో టిడిపికి భారీ షాక్ తగిలినట్టయింది. మాజీ టిడిపి ఎమ్మెల్యే పార్టీని వీడారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి గత నెలలో టిడిపిని వీడి జనసేనలో చేరనున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా గురువారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. దీనిపై పూర్తి సమాచారం కింద ఉంది చదవండి.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఏ నాయకులూ ఎప్పుడు పార్టీలు మారుతారో తెలియని పరిస్థితి. వారు ఆశించిన సీటు దక్కలేదనో, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలవదనో, లేదా పార్టీలో మరేదైనా అసంతృప్తి కారణంగానో ఇలా ఇతరత్రా కారణాల చేత నేతలు పార్టీ కండువాలు మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ తిరుపతి ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ గురువారం జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన తిత్లీ తుఫాను బాధితులను పరామర్శిస్తున్నారు. గురువారం శ్రీకాకుళం పర్యటనలో ఉన్న పవన్ ను చదలవాడ కలిశారు. పవన్ కళ్యాణ్ స్వయంగా చదలవాడకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు విరమించుకున్నప్పటి నుండి చదలవాడ టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన టిడిపి కి కాకుండా మారె రాజకీయ పార్టీతోనూ సంబంధాలు కొనసాగించట్లేదు. కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే గత నెలలో చదలవాడ కృష్ణమూర్తి హైదరాబాద్ జనసేన ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో, పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. అప్పుడే ఆయన జనసేనలో చేరడానికి పార్టీ పెద్దలతో కలిసి చర్చలు జరిపినట్టు, విజాయదశమి రోజే పార్టీలో చేరనున్నట్టు వార్తలు బయటకువచ్చాయి. కాగా అవి నిజమని నిరూపితమయ్యాయి. ఆయన సరిగ్గా విజయదశమి రోజే జనసేనలో చేరారు.
చదలవాడ 1999 లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో టిడిపి తరపున తిరుపతి నుండి పోటీ చేసి 15,000 ఓట్ల మెజారిటీ తో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015 ,ఏప్రిల్ 27 న టీటీడీ చైర్మైన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఏప్రిల్ 27, 2017 న ఆయన పదవి విరమణ చేశారు.