ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకే గాక పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
వైయస్ఆర్‌సీపీ హయాంలో పోలీసులు “గర్జించే పులుల్లా” ఉంటే, ఇప్పుడు చంద్రబాబు పాలనలో “కోర్లు పీకిన పాములుగా” మారారని ఆరోపించారు. ప్రజల రక్షణ కోసం ఉన్న పోలీస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఆటబొమ్మలా మార్చేసిందని మండిపడ్డారు.
శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు స్థానిక జనసేన నేతలు అటవీ శాఖ అధికారులను వేధించారని మాధవ్ తీవ్రంగా దుయ్యబట్టారు. రాత్రంతా అధికారులను జీపులో తిప్పుతూ హింసించారని ఆరోపించారు. ఇంతటి సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కేవలం ట్వీట్‌తో సరిపెట్టారని విమర్శించారు.
బాధిత అధికారులు వ్యక్తిగతంగా కలసి తన వేదన చెప్పినా పవన్ కళ్యాణ్ స్పందించలేదన్నారు. “నిందితులను కఠినంగా శిక్షిస్తాం” అని ప్రకటించాల్సిన పవన్ ఆ ధైర్యం చూపలేదని మండిపడ్డారు.బుడ్డాపై కిడ్నాప్, హత్యాయత్నం, విధుల్లో ఆటంకం కలిగించే సెక్షన్ల కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రెస్‌మీట్ నిర్వహించి నిందితుల అరెస్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట పోలీసులు బలహీనపడ్డారని, వైయస్ఆర్‌సీపీ పాలనలో నాలుగో స్థంభంలా ఉన్న పోలీసులకు ఇప్పుడు గౌరవం లేకుండా పోయిందని అన్నారు. గోరంట్ల మాధవ్ విమర్శల తూటాలు ఒకవైపు పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యంపై, మరోవైపు చంద్రబాబు పాలనలో పోలీసు వ్యవస్థ బలహీనతపై దూసుకుపోయాయి.



