Pawan Kalyan Warning: అటవీ అధికారులపై దాడి: టీడీపీ ఎమ్మెల్యేపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్

శ్రీశైలం అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన, బాధ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు.

అసలేం జరిగింది? రెండు రోజుల క్రితం శ్రీశైలం అడవిలో, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులతో ఘర్షణకు దిగారు. అర్ధరాత్రి సమయంలో వారిని వాహనాల్లో రెండు గంటల పాటు తిప్పుతూ దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన అధికారులు, సంబంధిత సీసీటీవీ ఫుటేజ్‌తో సహా మంత్రి పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు.

విచారణకు పవన్ ఆదేశం, ఫిర్యాదు అందిన వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. శాసనసభ్యులు, ఆయన అనుచరుల ప్రమేయంపై సవివరంగా విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బాధ్యులు ఎవరైనా సరే, నిబంధనల ప్రకారం వారిపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు: పవన్ హెచ్చరిక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడితే ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదు. అందుకు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఒకటే” అని ఆయన అన్నారు. అరెస్ట్ అయిన 31వ రోజు ప్రజాప్రతినిధి పదవి కోల్పోయే చట్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోందని గుర్తుచేశారు.

తాము తప్పు చేసినా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు , తాను స్పష్టంగా చెప్పామని పవన్ గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించే వారిని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ఘటనతో అధికారంలో ఉన్న వారు బాధ్యతాయుతంగా మెలగాలనే బలమైన సందేశాన్ని పవన్ పంపారు.

Analyst KS Prasad Analysis On Vice-President Election | Radhakrishnan Vs Sudarshan Reddy | AP | TR