షాకింగ్: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం

శ్రీకాకుళం జిల్లా సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత సాయిరాజు ఆత్మహత్యాయత్నం చేసారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా భారీగా నష్టపోయింది. ఈ వరద ముంపు కారణంగా కనీసం త్రాగు నీరు కూడా అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ప్రజలు ఇంత అలమటిస్తున్నా అధికారులు, యంత్రాంగం స్పందించట్లేదని సోంపేట ప్రజలు ఎమ్మార్వో ఆఫీసు వద్ద ఆందోళన చేపట్టారు. వారికి సమాధానం చెప్పడానికి కూడా కార్యాలయంలో సిబ్బంది లేరు. కాగా వీరికి మద్దతుగా ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే సాయిరాజు ఒంటిపై పెట్రోలు పోసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు, కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు.

తిత్లీ తుఫాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి ఆహార సదుపాయాలు, త్రాగటానికి నీరు పంపిణీ చేసే బాధ్యతను జన్మభూమి కమిటీలకు అప్పగించింది ప్రభుత్వం. వారు తమ పార్టీకి మద్దతు ఇచ్చే టిడిపి సానుభూతిపరులకే ఆహారాన్ని, నీటిని అందిస్తున్నారు. సామాన్యుల్ని పట్టించుకోవడం లేదు అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోనసీమ తర్వాత కొబ్బరి పంటకు పేరు గాంచింది ఉద్దానం. అటువంటి ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది తిత్లీ. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు బోరున విలపిస్తున్నారు.