Kodali Nani: కొడాలి నాని దేశం విడిచి వెళ్లనున్నారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అధికారంలో ఉన్న సమయంలో గుడివాడ నియోజకవర్గంలో చురుగైన రాజకీయ కార్యకలాపాలతో పాటు, ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలతో వార్తల్లో నిలిచారు. అయితే, 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత నాని రాజకీయాల నుంచి దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

పార్టీలో అరెస్టులు, వివాదాలు చెలరేగినప్పటికీ, ఆయన పెద్దగా బహిరంగంగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా పయనం రాజకీయంగా కొత్త ఊహాగానాలకు తెరతీసింది. ఇటీవల నాని ఆరోగ్య సమస్యలతో ముంబైలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న అతను, మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

కొద్దిమంది సన్నిహితులను మినహా ఎవరినీ కలవకుండా ఉంటున్న నాని ఆరోగ్యం పట్ల వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అమెరికా పర్యటన ఆరోగ్య కారణాలేనా లేక ఇతర ఉద్దేశాలు ఉన్నాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. వైసీపీ హయాంలో నానిపై ఇసుక, మట్టి అక్రమ రవాణా ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఈ ఆరోపణలపై విచారణ జరుపుతోంది. ఈ విచారణల నడుమ నాని విదేశీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. కొందరు దీనిని ఆరోగ్య కారణాలతో ముడిపెడుతుండగా, మరికొందరు రాజకీయ వ్యూహంగా చూస్తున్నారు. వైసీపీ నేతలు ఆయన తిరిగి రాజకీయంగా చురుగ్గా పాల్గొనాలని ఆశిస్తున్నారు. అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత నాని రాజకీయ పునఃప్రవేశం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.