ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ముఖ్యమంత్రి గా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారు. అది విజయవాడ నుంచి మొదలవుతున్నది. ఆయన రాజకీయ జీవితంలో ఇది నాలుగో చాప్టర్. మొదటి కాంగ్రెస్ జీవితం, రెండోది సమైక్యాంధ్ర పార్టీ జీవితం, మూడోది అజ్ఞాతవాసం. నాలుగోది మళ్లీ కాంగ్రెస్ లోకి రావడం.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు కిరణ్ కుమార్ రెడ్డి రేపు విజయవాడ వస్తున్నారు. ఈ సమావేశానికి ఎఐసిసి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జ్ వూమెన్ చాందీ కూాాాడా హాజరవుతున్నారు. కిరణ్ వస్తున్నందున ఈ సమావేశానికి ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే, ముఖ్యమంత్రిగా దిగిపోయాక మళ్లీ కాంగ్రెస్ గడప తొక్కడం ఇదే ప్రథమం.
యుపిఎ ప్రభుత్వం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు కిరణ్ . ఇక విభజన అనివార్యం అని తెలుసుకుని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
రాష్ట్ర వ్యాపితంగా తానే రెేకెత్తించిన సమైక్యాంధ్ర ఉద్యమం నిజమయిన ఉద్యమనుకుని, ఆ సెగలతో తను పార్టీ పెడితే గెలుస్తుందని ఆత్యాశకుపోయి 2014 లో ‘సమైక్యాంధ్ర’ పార్టీ స్థాపించారు. సమైక్యాంధ్ర పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. విభజన వద్దన్న కిరణ్ ను తిరస్కరించారు. విభజన తీసుకువచ్చిన కాంగ్రెస్ ను చితగ్గొట్టారు ఆంధ్రులు.
కిరణ్ బాగా వూపులో ఉన్నపుడు, పరిపాలన మెల్లిగా ప్రశంసలందుకుంటున్నపుడు, అంతా ‘అవురా కిరణ్’ అని అనుకుంటున్నపుడు రాష్ట్ర విభజన ప్రతిపాదనను కాంగ్రెస్ తీసుకువచ్చి ఆయన అజండాను బాగా దెబ్బ తీసింది. విభజన లేకపోయి ఉంటే, కిరణ్ సమర్థుడయిన ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకుని ఉండేవాడు.
దీనితో నిరాశకు లోనయిన కిరణ్ రాజకీయాలకు, రాజకీయ కార్యక్రమాలకు, చివరకు రాజకీయ ప్రకటనలకు కూడా దూరమయ్యారు. ఎంత దూరమయ్యారంటే, తాను ముఖ్యమంత్రిగా వెళ్ళిపోవడానికి ముందు చిత్తూరు జిల్లా కోసం ప్రకటించిన ఆరువేల కోట్ల మంచినీటి ఫథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసినా ఆయన ఉలకలేదు పలకలేదు.
ఇలా నాలుగు సంవత్సరాలు గడిచాయి. మధ్యలో బిజెపి వెళ్తాడని రూమర్ వచ్చింది. తర్వా త టిడిపిలోకి దారి వెదుక్కుంటున్నారని, అక్కడ పరిస్థితి అనుకూలంగా మార్చేందుకు తమ్ముడిని పచ్చ పార్టీలోకి పంపాడని అన్నారు.
ఇటీవల హాఠాత్తుగా ఆయన కాంగ్రెస్ లోచేరిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను పటిష్టపర్చడంలో భాగంగా కాంగ్రెస్ పాత కాపులందరిని రాహుల్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి కిరణ్ ను ఆహ్వానించారని చెబుతున్నారు. అంతేకాదు, రాష్ట్ర విభజన విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిందని నిజమని కూడా రాహుల్ అంగీకరించారని, దీనితో రాహుల్ తన మేధస్సుని గుర్తించారని భావించి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు కిరణ్ అంగీకరించినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.
మొత్తానికి ఢిల్లీ వెళ్లి పార్టీ అధినేత రాహుల్ సమక్షంలో కిరణ్ కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఆయన విజయవాడ వస్తున్నారు.
అంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకువచ్చే ప్రయత్నాల మీద రేపు చర్చ జరుగుతుందని, ఇందులో కిరణ్ కు కీలక పాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ పొత్తుల విషయం కూడా సమావేశంలో చర్చ జరుగుతుందని తెలిసింది. అయితే, తుది నిర్ణయం కాంగ్రెస్ హై కమాండ్ కు వదిలేస్తారని సీనియర్ నాయకులొకరు ‘తెలుగురాజ్యం’కు చెప్పారు.