పంచాయతీ ఎన్నికల వివాదంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఈసీకి జరుగుతున్న యుద్ధంలో ఉద్యోగులు, అధికారులు నలిగిపోతున్నారు. ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసిన ప్రభుత్వ పెద్దలు అదే పనిలో ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల కమీషనర్ ఆదేశాలు ఇవ్వడం కాదు వాటిని అనుసరించేది ఎవరి చూసుకోవాలి అంటూ బహిరంగంగా అనేశారు. నిమ్మగడ్డకు అనుకూలంగా ఎవరు పనిచేసినా వారి మీద తప్పకుండా గురి పెడుతున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు, అధికారులను బదిలీలు చేసేసశారు. కొందరు రిటానింగ్ అధికారులను, పరిశీలకులను ప్రభుత్వం బదిలీ చేసింది.
తాజాగా నెల్లూరు జిల్లా ఎన్నికల ప్రక్రియ పరిశీలకుడిగా ఉన్న ఐఏఎస్ బసంత్ కుమార్ బదిలీ అయ్యారు. బదిలీ అయిన ఆయనకు ఎలాంటి పదవీ కేటాయించలేదు ప్రభుత్వం. ఇది అచ్చంగా ఎన్నికల కమీషనర్ ఇచ్చిన ఆదేశాలను పాటించిన ఫలితమే. నిజానికి ప్రభుత్వానికి ఎన్నికల్లో జోక్యం చేసుకునే అధికారం లేదు. కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి విధుల్లో ఉన్న అధికారులు ఎవరైనా, ఎంతమందైనా ఈసీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేవలం ఎన్నికల నిర్వహణకు ఈసీకి కావాల్సిన ఉద్యోగులను సమకూర్చి పెట్టాలి అంతే. కానీ జగన్ ప్రభుత్వం అలా చెయ్యట్లేదు. ఈసీ ఆదేశాలను అనుసరిస్తే వేటు తప్పదు అన్నట్టే నడుచుకుంటోంది.
ఇలా తన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్న అధికారులను బదిలీలు చేయడం పట్ల ఈసీ కూడ తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని తెలియజేస్తూ బదిలీలు చేసిన అధికారులను, ఉద్యోగులను తక్షణమే తిరిగి వారి విధుల్లో నియమించాలని ఆదేశించారు. ఒకవేళ బదిలీలు చేయాల్సి వస్తే ఈసీని ఒప్పించేలా సంతృప్తికరంగా కారణం చెప్పాలని అన్నారు. అంతేకాదు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు రాజ్యాంగ రక్షణ ఉంటుందని కూడ హామీ ఇస్తున్నారు. అయితే నిమ్మగడ్డ ఆదేశాలను ప్రభుత్వం పాటించే తరహాలో లేదు. ఈ పరిస్థితిని చూస్తే అధికారులకు ఇబ్బందులు తప్పవని, ఎన్నికల పూర్తైన తర్వాత కూడ వారి మీద ప్రభావం ఉంటుందని అనిపిస్తోంది.