ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళాల్సిన విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్ అయ్యింది. గన్నవరం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాస్సేపటికే విమానం తిరిగొచ్చింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ చాకచక్యంగా విమానాన్ని తిరిగి గన్నవరంలోనే ల్యాండింగ్ చేశారు.
కాగా, ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోపక్క, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్నదానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకింత అసహనానికి గురయ్యారంటూ ప్రచారం జరుగుతోంది.
రేపు ఢిల్లీలో జరిగే అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులు, ఎంపీలు ప్రత్యేక విమానంలో వెళ్ళాల్సి వుంది. మరోపక్క, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం నిమిత్తం.
కాగా, సోషల్ మీడియా వేదికగా ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వ్యవహారంపై కామెంట్లు పోటెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కుట్ర జరుగుతోందంటూ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రస్తావిస్తున్నారు వైఎస్ జగన్ అభిమానులు.
అదే సమయంలో, ‘ఇది మొదటి ప్రమాద హెచ్చరిక..’ అంటూ వైఎస్ జగన్ వ్యతిరేకులు సెటైర్లు వేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కేవలం ఓ వ్యక్తి కాదు.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంతటి బాధ్యతాయుతమైన పదవిలో వున్న వ్యక్తులకు సంబంధించి ‘తేలిక’ వ్యాఖ్యలు, ‘అర్థం పర్థం లేని అనుమానాలు’ కామెంట్ల రూపంలో పోస్ట్ చేయడం ఎవరికీ తగదు.