వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ప్రజల నుండి ఎదుర్కొంటున్న ఏకైక అభియోగం అందుబాటులో ఉండట్లేదని. ఎన్నికల్లో గెలిచాక కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వైపు పెద్దగా చూడట్లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వైఎస్ జగన్ పాలనలో పడి పార్టీని పెద్దగా పట్టించుకోవట్లేదు. దాంతో ఎమ్మెల్యేలు కొందరు ఇష్టారీతిన పోతున్నారు. అలాంటి వారిలో ఆళ్ల నాని పేరు కూడ వినిపిస్తోంది. ఏలూరు నుండి గత ఎన్నికల్లో గెలిచారు ఆయన. జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. నిజానికి నాని ఎమ్మెల్యేగా గెలిచింది తక్కువ మెజారిటీతోనే. ఆయనకు పదవి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ సామాజికవర్గ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు పదవి లభించింది.
ఊహించని ఈ పరిణామంతో ఏలూరు జనం ఆయన మీద బోలెడు ఆశలు పెట్టేసుకున్నారు. తన నియోజకవర్గం నుండి ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తమకు ఇక ఏ లోటూ ఉండదని, నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతుందని, అన్ని నియోజకవర్గాల కంటే భిన్నంగా ఉంటుందని భావించారు. కానీ వారి ఆశలేవీ నెరవేర లేదు. అన్ని చోట్ల ఉన్న పరిస్థితే ఏలూరులో కూడ కనిపిస్తోంది. అభివృద్ధి సంగతి దేవుడెరుగు ముందు డిప్యూటీ సీఎం దర్శనభాగ్యం కలిగితే చాలని అనుకుంటున్నారట ప్రజలు. గతంలో ఆళ్ళ నాని కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచినప్పుడు బాగానే ఉండేవారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పనులు చూసుకునేవారు. అదే ఆయన్ను వరుస విజయాలు పొందేలా చేసింది.
కానీ ఈసారి మాత్రం ఆయన పంథా మార్చరట. ఎవరో సన్నిహితులకు తప్ప సామాన్యులకు దొరకట్లేదట. జనం సంగతే కాదు శ్రేణుల పరిస్థితీ అదేనట. నియోజకవర్గంలోని చిన్నా చితకా నాయకులకు నానిని కలవడం సాధ్యంకాని పనిలా మారిందట. సమస్యలు చెప్పుకుందామని ఎప్పుడు వెళ్లినా నిరాశే ఎదురవుతోందట. దీంతో వారంతా ముఖ్యమంత్రి కంటే ఉప ముఖ్యమంత్రే ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారే అనుకుంటున్నారు. దీంతో టీడీపీ మెల్లగా పుంజుకుంటోందట. గత ఎన్నికలో తృటిలో గెలుపు మిస్సైన ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడు నాని ప్రభావం లేకపోవడంతో నియోజకవర్గం మీద పట్టు కోసం గట్టిగా కృషి చేస్తున్నాయట. సరే నియోజకవర్గంలో కనబడని ఆయన మీడియాలో అయినా కనిపిస్తారా అంటే అదీ లేదట. మిగతా మంత్రులు మైకులు పట్టుకుని వీరంగం చేస్తుంటే ఈయన నల్లపూస అయిపోయారని, ఇలా ఉంటే వచ్చే దఫాలో గెలుపు కష్టమేనని అంటున్నారు.