వాలంటీర్ల విషయంలో ఈసీ కీలక నిర్ణయం… సచివాలయం స్టాఫ్ సంగతి సరే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ ఫుల్ బిజీ అయిపోయింది. ఇదే సమయంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఏపీలో వాలంటీర్లు – వారికి ఎన్నికల విధులు వంటి విషయంపై కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఇదే సమయంలో గ్రామ / వార్డు సచివాలయ స్టాఫ్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు జారీచేసింది.

అవును… ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏపీలో ఈ వ్యవస్థ అతి పెద్దదిగా ఉండటంతో పాటు.. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇంటివరకూ చేర్చడంలో కీలక భూమిక పోషిస్తుంది. ఈ క్రమంలో సుమారు రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్లు ఏపీ అంతా ఉన్నారు. వారే వైసీపీకి అతి పెద్ద సైన్యం అని కూడా చెబుతుంటారు.

దీంతో.. ఎన్నికల వేళ తమకు వైసీపీకి వాలంటీర్లు ఎంతగానో ఉపయోగపడతారు అని వైసీపీ ధీమాగా ఉందని చెబుతుంటారు. ఇదే సమయంలో వైసీపీ ఎంత ధీమాగా ఉందో.. అదేసథాయి ఆందోళనలో విపక్షాలు ఉన్నాయని చెబుతుంటారు. పైగా ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ అవాకులూ చెవాకులూ పేలగా… టీడీపీ మొదట్లో ఈ వ్యవస్థను తప్పుపట్టి.. తర్వాత సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టింది.

ఈ నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థ విషయంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. వాలంటీర్లను ఎన్నికల విధులలోకి తీసుకోవద్దని ఈసీ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సూచించింది. ఎన్నికల విధులకు పూర్తిగా వాలంటీర్లను దూరంగా పెట్టాలని స్పష్టంగా చెప్పింది. ఇదే సమయంలో సచివాలయ ఉద్యోగుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా… లక్షన్నర దాకా ఉన్న సచివాలయ సిబ్బందిని విధులలోకి తీసుకోవచ్చు అని పేర్కొంది. అయితే… సచివాలయంలో రెగ్యులర్ గా పనిచేసే స్టాఫ్ ను విధుల్లోకి తీసుకున్నప్పటికీ వారికి ఓటర్ల వేలికి ఇంకు పూసే పనిమాత్రమే అప్పగించాలనిసూచిస్తూ… అంతకు మించి ఎలాంటి బాధ్యతలు ఇవ్వవద్దని స్పష్టం చేసింది.

ఈ విధంగా సచివాలయం స్టాఫ్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఈసీ… వాలంటీర్లు మాత్రం దూరంగా ఉండాల్సిందే అంటూ వారిని కనీసం పోలింగ్ ఏజెంట్ గా కూడా అనుమతించవద్దు అని తేల్చేసింది. దీంతో ఈ విషయం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.. దీనిపై అధికార పార్టీ ఏ విధంగా స్పందించబోతుందనేది వేచి చూడాలి!