ఏపీలో రాజకీయ పార్టీల సందడితో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చేసినట్లు కనిపిస్తున్న తరుణంలో… ఆ వేడిని కంటిన్యూ చేసేలా ఎన్నికల కసరత్తు మోదలైపోతుంది. ఇందులో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షెడ్యూల్ ను ప్రకటించారు. తనకు ముందస్తు ఆలోచన లేదని బలంగా చెబుతున్నా నేపథ్యంలో… ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది.
అవును… ఏపీలో ఎన్నికల కసరత్తును మొదలు పెట్టేసింది ఎన్నికల కమిషన్. ఇందులో భాగంగా… ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేష్ కుమార్ మీనా ఇవాళ వార్షిక ఎన్నికల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటించారు. దీని ప్రకారం జూలై 21న మొదలయ్యే ఈ కసరత్తు.. వచ్చే ఏడాది జనవరి 5 వరకూ కొనసాగబోతోంది.
జూలై 21 నుండి ఆగస్టు 21 వరకూ బి.ఎల్.ఓ.ల ఇంటింటి పరిశీలన.. అక్టోబరు 17న సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ.. అక్టోబరు 17 నుండి నవంబరు 30 వరకూ అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని ఈసీవో ప్రకటించేశారు. ఇదే సమయంలో… అభ్యంతరాల స్వీకరణకు అక్టోబరు 28, 29.. నవంబరు 18, 19 తేదీల్లో బూత్ స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని, డిశంబరు 26 కల్లా వీటిని పరిష్కరిస్తామని… అనంతరం ఫైనల్ గా… జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుందని ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు.
రాష్ట్రంలోని 18-19 సంవత్సరాల యువ ఓటర్లలో జనాభా శాతం ప్రకారం 12 లక్షల యువ ఓటర్లు ఉండాలని.. అయితే 3.50 లక్షల యువఓటర్లు మాత్రమే ఉన్నారని, ఈ వ్యత్యాసాన్ని పూరించాల్సి ఉందని సీఈవో చెబుతున్నారు. ఇందులో భాగంగా… వచ్చే ఏడాది జనవరి 1 కల్లా 18 సంవత్సరాలు నిండే యువత ఓటర్లుగా తమ పేరును నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.