తూరుపు.! పడమర.! పవన్ కళ్యాణ్ దారెటు.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి.. రెండు చోట్లా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో జనసేన అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు.?

‘ముందైతే మీరు పోటీ చేయబోయే నియోజకవర్గమేదో చెప్పండి.. ఆ నియోజకవర్గంలో మీ గెలుపు సంగతి మేం చూసుకుంటాం..’ అని జనసైనికులు కోరుతున్నా, జనసేన నేతలు చాలామంది సూచిస్తున్నా.. ఇంతవరకు జనసేనాని మాత్రం, తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై స్పష్టతనివ్వడంలేదు.

ప్రస్తుతం వారాహి విజయ యాత్ర జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర పూర్తయ్యింది.. పశ్చిమగోదావరి జిల్లాలోకి అడుగు పెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో (ఉమ్మడి జజిల్లా) రెండే రెండు నియోజకవర్గాలు హాట్ టాపిక్.. జనసేనానికి సంబంధించి.

ఒకటేమో, కాకినాడ.. ఇంకోటేమో పిఠాపురం.! ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి జనసేనాని పోటీ చేస్తారు.? అన్న చర్చ నిన్న మొన్నటిదాకా జరిగింది. ‘చేతనైతే నా మీద పోటీ చెయ్..’ అని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసురుతున్న సంగతి తెలిసిందే. కాకినాడలో వారాహి యాత్ర సందర్భంగా హడాడిడి చేసి, ఆ తర్వాత లైట్ తీసుకున్నారు జనసేనాని.

ఇక, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభవం సవాల్ విసురుతున్న సంగతి తెలిసిందే. తూరుపు సంగతి పక్కన పెడితే, పశ్చిమాన.. భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాలపై జనసేన స్పెషల్ ఫోకస్ పెట్టనుంది.

భీమవరంలో గతంలో జనసేనాని ఓడిపోయినా, అక్కడ జనసేనకు మైలేజ్ ఇటీవలి కాలంలో పెరిగింది. పాలకొల్లులోనూ జనసేనకు పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. కానీ, ఇవన్నీ ఎన్నికలకు చాలా రోజుల ముందర పరిస్థితులు మాత్రమే. ఎన్నికల వాతావరణం వేరేలా వుంటుంది. జనసేనానికి ఆ విషయం బాగా తెలుసు. తూరుపుపై ఆశలు తక్కువగా, పశ్చిమంపై ఆశలు కాస్త ఎక్కువగా వున్నాయి జనసేనాని పోటీ చేయబోయే స్థానానికి సంబంధించి.