జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముగ్గురు వ్యక్తులు ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ ని చంపేయాలి అని మాట్లాడుకుంటున్న మాటలు విన్నానని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారి తీశాయి. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించారు తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారులు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు.
ఈ నెల 27 గురువారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా జనసేన పోరాటయాత్ర భారీ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… ఈమధ్యనే నాకు ఒక విషయం తెలిసింది. ఆ వ్యక్తులెవరో నాకు తెలుసు. ఎన్నికలకి ముందే పవన్ ని లేపేస్తే ఐపోతుంది. అధికార పక్షం అని విపక్షం, విపక్షం అని అధికార పక్షం అనుకుంటాయి. చివరకు రెండు పార్టీలే ఉంటాయని కుట్ర చేస్తున్నారు. ఆ రికార్డు నా దగ్గరకు వచ్చింది. ఆ ఆడియో టేపు నా దగ్గరే ఉంది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. అలాంటి కుట్రలతో నన్ను భయపెడదాం అనుకుంటే కుదరదు అని మాట్లాడిన పవన్ సంచలనానికి తెర లేపారు.
పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ ని చంపాలి అనుకుంటున్న వ్యక్తులు ఎవరా అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారులు పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తనపై హత్యకు కుట్ర పన్నిన వ్యక్తులు ఎవరో చెప్పాలని కోరారు. వారి పేర్లను చెబితే ఖచ్చితంగా విచారణ జరుపుతామని తెలిపారు. ఆ ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన ఆడియో టేపు ఇస్తే వారిపై చర్యలు చేపడతామని అన్నారు. దీనిపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.