ఏప్రిల్ 3న వైఎస్ జగన్ ‘ముందస్తు’ సందేశం.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏప్రిల్ 3న కీలక ప్రకటన చేయబోతున్నారట. ఈ విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలతోనే, ఏపీలోనూ ఎన్నికలు జరిగేందుకు ఆస్కారం వుందట.

ముందస్తు దిశగా వైఎస్ జగన్ ఇప్పటికే పలు మార్లు సంకేతాలు పంపారు. ‘మేమెందుకు ముందస్తుకు పోతాం.?’ అంటూ వైసీపీ నేతలు కొందరు (సజ్జల రామకృష్ణారెడ్డి లాంటోళ్ళు) చెబుతున్నా, తెరవెనుకాల మంత్రాంగం అయితే గట్టిగానే జరుగుతోంది. కాగా, ఏప్రిల్ 3వ తేదీన మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి కీలక ప్రకటన వైఎస్ జగన్ చేయబోతున్నారట. నలుగురు లేదా ఐదుగురికి కొత్తగా మంత్రి వర్గంలో అవకాశం కల్పించబోతున్నారట వైఎస్ జగన్. అదే సమయంలో, నలుగురు లేదా ఐదుగురికి ఉద్వాసన తప్పదు.

మరోపక్క, ఏప్రిల్ 3వ తేదీనే ముందస్తు ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ 18 నుంచే ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతోందిట తెలుగు రాష్ట్రాల్లో. పోలింగ్ తేదీ మీదకూడా ఖచ్చితమైన అంచనాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 15న పోలింగ్ జరుగుతుందనీ, డిసెంబర్ 19న కౌంటింగ్ వుండొచ్చనీ అంటున్నారు.

డిసెంబర్ 23న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం (ముఖ్యమంత్రిగా మళ్ళీ వైఎస్ జగన్ పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని) వైసీపీలో చర్చ జరుగుతోంది. తేదీలు కాస్త అటూ ఇటూగా వున్నా, డిసెంబర్‌లోనే మొత్తం వ్యవహారం పూర్తయిపోతుందిట. తెలంగాణలోనూ ఇవే తేదీల్లో ఎన్నికలు జరిగే అవకాశం వుందంటున్నారు.