ప‌వ‌న్ ప్యాకేజీ ఎన్ని కోట్లో చెబుతున్న వైసీపీ… నెక్స్ట్ టార్గెట్?

పవన్ కల్యాణ్ ని రాజకీయంగా విమర్శించాల్సినప్పుడల్లా ప్యాకేజీ స్టార్ అంటూ గాలి తీసేస్తుంటుంది అధికార వైసీపీ. ఇదే సమయంలో పవన్ కూడా ఆ విమర్శకు బలం చేకూరుస్తున్నట్లుగానే ప్రవర్తిస్తుంటారని అంటుంటారు. ఈ క్రమంలో చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టు చేసిన అనంతరం పవన్ చేసిన ప్రవర్తనపైనా భిన్నమైన కామెంట్లు వచ్చాయి.

ఇదే సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాకత్ అనంతరం పవన్ కల్యాణ్… టీడీపీతో పొత్తును ప్రకటించారు. జనం ఏమనుకుంటే నాకేంటి అనుకున్నారో ఏమో కానీ… ఆ ఆలోచన తనకు అప్పుడే వచ్చిందని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసే పోటీ చేస్తాయని ప్రకటించారు పవన్. దీంతో ప్యాకేజీ స్టార్ అనే విషయం తాము ఎప్పుడో చెప్పామని తెలిపారు.

అదేవిధంగా… అవినీతి కేసులో అరెస్టైన చంద్రబాబుని వెనకేసుకు రావడం అంటే, ఆయనకు మద్దతుగా మాట్లాడటం అంటే… ఆ అవినీతిలో ఇతనికి కూడా వాటా ఉందనే అనుమానాలను బలపరచడమే అని అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. ఈ నేపథ్యంలో వారాహి తొలివిడతలో కాకినాడ సభలో పవన్.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తాజాగా మైకుల ముందుకు వచ్చారు.

ఇందులో భాగంగా… ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, జనసేన అధినేత పవన్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు తెలిసి రూ.1,400 కోట్ల ప్యాకేజీ సొమ్ము హ‌వాలా ద్వారా దేశ స‌రిహ‌ద్దులు దాటింద‌ని ఆయ‌న తీవ్రఆరోప‌ణ‌లు గుప్పించారు. ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీ డబ్బులు ర‌ష్యా, దుబాయ్‌, సింగ‌పూర్ దేశాల్లో ఎక్కడికి వెళ్లిందో తేలాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో… ప‌వ‌న్ ప్యాకేజీ సొమ్ము విదేశాల‌కు వెళ్లింద‌నేది నిజ‌మ‌ని, ఆ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డం ఖాయ‌మ‌ని చెప్పిన ద్వారంపూడి… ప‌వ‌న్‌ ను క‌చ్చితంగా తాను ప్యాకేజీ క‌ల్యాణ్ అంటాన‌ని స్పష్టం చేశారు. అనంతరం ఎన్నికల్లో పోటీ విషయంలో పవన్ కు ద్వారంపూడి ఛాలెంజ్ చేశారు. ఇందులో భాగంగా బీజేపీని కాద‌ని ద‌మ్ముంటే ప‌వ‌న్‌ క‌ల్యాణ్ బ‌య‌ట‌కు రావాల‌ని ఆయ‌న అన్నారు.

అదేవిధంగా… ప‌వ‌న్‌ కు ద‌మ్ముంటే కాకినాడ‌లో త‌న‌పై గ్లాస్ గుర్తును పోటీకి నిల‌పాల‌ని ద్వారంపూడి స‌వాల్ విసిరారు. త‌మ ప్రభుత్వం రాగానే ద్వారంపూడిని క‌ట్టేసి వీధిలో లాక్కుంటే వెళ్తాన‌ని, గుడ్డలూడదీసి కొడతానని ప‌వ‌న్ వారాహియాత్రలో కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే. నాటినుంచి ప‌వ‌న్‌ పై ద్వారంపూడి తీవ్రస్థాయిలో మండిప‌డుతున్నారు. ఇప్పుడు ఏకంగా ప్యాకేజీ ఎంత ద‌క్కిందో కూడా ఆయ‌న చెప్పడం గ‌మ‌నార్హం.

అయితే వీటిని కేవలం రాజకీయ ఆరోపణలుగానే చూడాలా.. లేక, అధికార వైసీపీ వద్ద దీనికి సంబంధించిన ఆధారలు ఉన్నాయా.. ఉంటే, నెక్స్ట్ శ్రీకృష్ణ జన్మ స్థానానికి వెళ్లేది పవన్ కల్యాణేనా అనే చర్చ ఆన్ లైన్ వేదికగా జరుగుతుంది. మరి ఏమి జరగబోతుంది.. ద్వారంపూడి చంద్రశేఖర్ ఆ మూడు దేశాల పేర్లు మాత్రమే ఎందుకు చెప్పారు అనేది తెలియాల్సి ఉంది!