దుబ్బాక ఉపఎన్నికలో గెలవాలని తెరాస, కాంగ్రెస్, బీజేపీలు సన్నాహాలు చేసుకుంటుంటే తెరాస రెబల్స్ ఎలాగైనా టికెట్ సంపాదించుకుని బరిలో నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉప ఎన్నిక అనివార్యమైన రోజు నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి కీలక నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. దివంగత నేత చెరుకు ముత్యం రెడ్డి కుమారుడైన శ్రీనివాస్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. బలమైన క్యాడర్ కలిగి ఉన్నారు. పార్టీలో చేరేముందు కేసీఆర్ సైతం ప్రాముఖ్యత ఇస్తానని హామీ ఇచ్చారు. అందుకే ఆయన ఉప ఎన్నికల టికెట్ దక్కించుకోవాలని బలంగా ఉన్నారు.
కానీ కేసీఆర్ మాత్రం మరణించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికి టికెట్ ఇవ్వాలని దాదాపు డిసైడ్ అయ్యారు. అందుకే శ్రీనివాస్ రెడ్డిని పక్కనబెట్టారు. ఇక తెరాసతో లాభం లేదనుకున్న శ్రీనివాస్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహతో మంతనాలు సాగిస్తున్నారట అయితే ఇప్పటికే ఆ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది.
కానీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎంట్రీతో సీన్ మారిపోనుందని రాజకీయ వర్గాల టాక్. దామోదర్ రాజనర్సింహ కలుగజేసుకోవడంతో అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించే అవకాశం లేకపోలేదట. శ్రీనివాస్ రెడ్డి తండ్రి ముత్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేత కాబట్టి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సహా ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పెద్దలు నర్సారెడ్డికి కాకుండా శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే విషయమై గాంధీ భవన్ నందు సమావేశం కానున్నారట. ఈ సమావేశంతో చెరుకు శ్రీనివాస్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినికిడి. ఇదే జరిగితే బలమైన క్యాడర్ కలిగిన చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఓడించి దుబ్బాకలో గర్జించాలనే కేసీఆర్ ఆశలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదు.