అరకు టిడిపి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు , మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను నక్సల్స్ హత్య చేయడంతో రెండు తెలుగురాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి. ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎపుడో తెలంగాణలో మల్హర్ రావును నక్సల్ లైట్లు చంపారు. ఈ మధ్యలో పెద్ద హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులజోలికి వారు వెళ్లలేదు. ఇక ఆంధ్రకు సంబంధించి ఇటీవలి కాలంలో రాజకీయనాయకుల జోలికి వెళ్లలేదు. 14 సంవత్సరాల కిందట 2004 మార్చి 18న నాటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మత్స్యరాస మణికుమారి భర్త వెంకటరాజును కాల్చి చంపారు. ఇపుడ మళ్లీ ఇదే.కిడారిని చంపిన విషయం ప్రపంచానికి మొదట చెప్పింది ఆయన డ్రైవర్ చిట్టిబాబే. ఆయన చెప్పిందాని ప్రకారం ఎమ్మెల్యను చేతులు వెనక్కి కట్టి.. పాయింట్ బ్లాంక్ రేంజ్ కాల్చి చంపారు.
డ్రైవర్ చిట్టిబాబు మీడియాకు వెల్లడించిన వివరాలు…
రెండు వాహనాల్లో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ వెళ్తున్నారు. వారి వాహనాలలో మరొక ఆరుగురు కూడా ఉన్నారు. దారిలో ఒక చోట మావోయిస్టులు మమ్మల్ని చుట్టుముట్టారు. వాహనాలు ఆపకుంటే బాంబులతో పేల్చేస్తామని హెచ్చరించారు.అయినా ముందుకెళ్లడానికి ప్రయత్నించాం. దాదాపు 20మంది నక్సల్స్ మాకు అడ్డుగా వచ్చారు. ముందుకు పోవడానికి ప్రయత్నిస్తే ఎన్‌కౌంటర్ దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఏమీ చేయలేక భయం భయంగా వాహనాలను ఆపేశాం. సోమ ఎవరని అడిగారు. ఆయనెవరో చెప్పగానే కారు నుంచి దించి సోమ చేతులు వెనక్కి కట్టేశారు. గన్‌మెన్లు, డ్రైవర్‌ల ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు చేతులు కూడా వెనక్కి కట్టి తీసుకువెళ్లారు. వాళ్లిద్దరినీ దూరంగా తీసుకువెళ్లారు. ఒక అరగంట తర్వాత మూడు, నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి వెళ్లిపోయారు.