వివేకా హత్య కేసు :  చంద్రబాబు, జగన్ ఇద్దరినీ చెంపదెబ్బకొట్టిన కూతురు

నాలుగు రోజుల క్రితం హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వాదనలపై సునీత చెంపదెబ్బ కొట్టారు. వివేకా మర్డర్ జరిగిన దగ్గర నుండి రకరకాల పుకార్లు ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వివేకా హత్య ను చంద్రబాబునాయుడు అండ్ కో ఆపాదించాలని జగన్మోహన్ రెడ్డి అండ్ కో విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సందర్భంగా వివేకా హత్యలో  వైఎస్ కుటుంబ హస్తమే ఉందని చంద్రబాబు అండ్ కో ఎదురుదాడి చేస్తోంది. మధ్యలో చంద్రబాబు మీడియా కూడా వివేకా హత్యలో వైఎస్ కుటుంబానికే సంబంధం ఉందని నిరూపించేందుకు సొంతంగా దర్యాప్తు చేసేస్తోంది.

హత్య జరిగిన ఇన్ని రోజుల తర్వాత వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత మీడియా ముందుకొచ్చారు. మీడియాతో సునీత మాట్లాడుతూ హత్య కేసును రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న చంద్రబాబు, జగన్ లపై విరుచుకుపడ్డారు. ఏ ఒక్కరి పేరు కూడా బయటపెట్టకుండానే ఇటు చంద్రబాబు, అటు జగన్ ను తప్పుపట్టారు. హత్య కేసు దర్యాప్తుపై ప్రభుత్వం సిట్ నియమించిన తర్వాత మధ్యలో వీళ్ళందరి హడావుడి ఏమిటని నిలదీశారు.

హత్య ఘటన దర్యాప్తుపై వేసిన సిట్ ను తనపని తనను చేసుకోనీకుండా వీళ్ళందరి ఒత్తిడి ఏమిటో తనకు అర్ధం కావటం లేదన్నారు. ఎవరిష్ట ప్రకారం పుకార్లను వ్యపింపచేస్తు, ఆరోపణలను చేసేసుకుంటున్నపుడు ఇక సిట్ దర్యాప్తు ఎందుకంటూ ప్రశ్నించారు. సునీత వేసిన ప్రశ్నలో నిజముందన్న విషయాన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. ఒకవైపు సిట్ దర్యాప్తు జరుగుతుండగానే చంద్రబాబు, జగన్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పేస్తుంటే ఇక సిట్ ఏ విధంగా ఫెయిర్ గా దర్యాప్తు చేస్తుందని ఆమె నిలదీశారు.

తన తండ్రి హత్యకు కారణాలేంటి, కారకులెవరు ? అన్న విషయాలపై సిట్ చేస్తున్న దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూస్తాయనే తాను నమ్ముతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. తండ్రి చనిపోయిన బాధలో తాముంటే మధ్యలో ఈ అసత్య ప్రచారాలు చేయటమేంటనే ప్రశ్న అందరికీ వర్తింపచేసేదే. సునీత ఇంత చెప్పిన తర్వాత కూడా మీడియా హత్యకు గల కారణాలేంటి ? ఎవరు చేసుండొచ్చు ? వివేకా రాసినట్లుగా ప్రచారంలో ఉన్న లేఖ గురించి కూడా గుచ్చిగుచ్చి అడగటమే విచిత్రంగా ఉంది.