విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ కు అయిన గాయం మానేందుకు ఎంత కాలం పడుతుందో తెలుసా ? కనీసం 6 వారాలు పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మొన్న 25వ తేదీన హైదరాబాద్ కు వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్ లో వెయిట్ చేస్తున్న జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సెల్ఫీ తీసుకుంటానని ఎయిర్ పోర్టు క్యాంటిన్లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే యువకుడు జగన్ ను అడిగాడు. విమానం ఎక్కేందుకు ఇంకా సమయం ఉందికదా అని జగన్ కూడా సరే అన్నాడు. దాంతో దగ్గరకు వచ్చిన వెంటనే శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. ప్రమాదాన్ని గ్రహించిన జగన్ వెంటనే పక్కకు తప్పుకోవటంతో గొంతులో దిగాల్సిన కత్తి ఎడమభుజం క్రింద దిగింది.
సరే విమానాశ్రయంలోనే ప్రధమ చికిత్స చేయించుకున్న జగన్ వెంటనే హైదరాబాద్ వచ్చేశారు. హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. గాయాన్ని పరీక్షించిన వైద్యులు 9 కుట్లు వేశారు. 24 గంటలపాటు అబ్సర్వేషన్లో ఉంచుకుని మరుసటి రోజు పంపేశారు లేండి. అదే డాక్టర్లు ఈరోజు గాయాన్ని పరీక్షించేందుకు జగన్ ఇంటికి వచ్చారు. గాయానికి డ్రస్సింగ్ చేశారు. తర్వాత మాట్లాడుతూ, గాయం పూర్తిగా మానటానికి కనీసం 6 వరాలు పడుతుందని చెప్పారు. భుజాన్ని కదుపుతున్నపుడు జగన్ నొప్పి ఫీలవుతున్నట్లు చెప్పారు. కత్తిపోటు వల్ల భుజం కండరానికి తీవ్ర గాయమైన కారణంగా భుజాన్ని ఫ్రీగా అటు ఇటు తిప్పలేకున్నట్లు డాక్టర్లు అభిప్రాయపడ్డారు.
గాయం పూర్తిగా మానేందుకు, భుజం కండరం ఫ్రీగా కదిలేందుకు 6 వారాల సమయం పడుతుందని స్పష్టంగా చెప్పారు. పాదయాత్రను అర్ధాంతరంగా వదిలేసిన జగన్ వచ్చే నెల 3వ తేదీ నుండి మొదలుపెడదామని అనుకుంటున్నారు. అయితే, డాక్టర్లేమో మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎందుకంటే, గాయం పూర్తిగా మానకుండానే మళ్ళీ జనాల్లోకి వెళితే ఏదన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారట. దానికితోడు వాతావరణ ప్రభావం, దుమ్ము, దూళితో గాయం ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదం కూడా ఉందని స్పష్టంగా చెప్పారట. మరి జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.