కడప జిల్లాలో తెలుగుదేశంపార్టీకి కొత్త శతృవు తయారయ్యారు. ఆయనే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి. అంటే ఆయన జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయలేరు కానీ మైదుకూరు నియోజకవర్గంలో మాత్రం అభ్యర్ధుల గెలుపోటములను డిసైడ్ చేయగలరనే అనుకుంటున్నారు. ఎందుకంటే, డిఎల్ కు నియోజకవర్గంలో పట్టుంది లేండి. మొన్నటి వరకూ టిడిపి తరపున డిఎల్ పోటీ చేయబోతున్నారంటూ బాగా ప్రచారం జరిగింది. అలాంటిది ఒక్కసారిగా రెడ్డిగారు ఎందుకు రివర్స్ గేరులో మాట్లాడుతున్నారు ?
ఎందుకంటే, టిడిపి తరపున మైదుకూరులో డిఎల్ కే టికెట్ అంటూ ప్రచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అవతల పార్టీలో ప్రత్యర్ధి సుధాకర్ యాదవ్. ప్రస్తుత టిటిడి బోర్డు ఛైర్మన్. ఈయన పోయిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి రఘురామిరెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. దాంతో డిఎల్ టిడిపిలోకి వచ్చి పోటీ చేస్తారనే అనుకున్నారు. చంద్రబాబునాయుడుతో డిఎల్ భేటీ కూడా జరిపారు.
సరే తర్వాత ఏం జరిగిందో ఏమోకానీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయేది మాత్రం సుధాకర్ యాదవే అంటూ చంద్రబాబు తేల్చేశారు. యనమల రామకృష్ణుడికి వియ్యంకుడైన సుధాకర్ కు కాకుండా తనకు టికెట్ వస్తుందని డిఎల్ ఎలా అనుకున్నారో ఏమో ? ఎప్పుడైతే తనకు టికెట్ రాదని తేలిపోయిందో వెంటనే చంద్రబాబుపై మండిపడుతున్నారు. టిడిపిని భూస్ధాపితం చేయటమే తన లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. రాష్ట్రంలో టిడిపిని భూస్ధాపితం చేసేంత సీన్ డిఎల్ కు లేదని అందరికీ తెలుసు. కాకపోతే ఇండిపెండెంట్ గా పోటీచేస్తే టిడిపి అభ్యర్ధి గెలుపు అవకాశాలను దెబ్బకొట్టగలరేమో చూడాలి.