అసెంబ్లీ రద్దు పై డికె అరుణ కేసు

అసెంబ్లీ రద్దు పై తెలంగాణ కాంగ్రెస్ నేత డికె అరుణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేవలం కేభినేట్ నిర్ణయంతో అసెంబ్లీని ఎలా రద్దు చేస్తారని డికె అరుణ ప్రశ్నించారు. 9 నెలల సమయం ఉండగానే సభలోని సభ్యులకు సమాచారం ఇవ్వకుండా సభ్యుల హక్కులకు భంగం కలిగించారని డికె అరుణ ఆరోపించారు.  లంచ్ మోషన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిటిషన్ ను విచారించనుంది. 

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడం పై చాలా పిటిషన్లు దాఖలైనాయి. డికె  అరుణ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ తో అన్ని పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయన్న పిటిషన్ విచారణకు వచ్చింది. దాదాపు 30 లక్షల బోగస్ ఓట్లను తొలగించామని ఈసీ హైకోర్టుకు తెలిపింది. 

ఎన్నికల సంఘం షెడ్యూల్ ను కూడా ప్రకటించడంతో ఇప్పుడు హైకోర్టులో వేసిన పిటిషన్ తో ఈ కేసు నిలబడేనా లేక హైకోర్టు నిలిపేసేనా అనే చర్చ అందరిలో మొదలైంది. సభ్యులందరికి కనీస సమాచారం ఇవ్వకపోవడం సభ్యుల హక్కులు కాలరాసినట్టేనని డికె అరుణ అన్నారు. ఇష్టమొచ్చినట్టు సభలను రద్దు చేస్తారా ఇదేమైనా ఆటనా అని అరుణ మండిపడ్డారు. 9 నెలల ముందుగా ఎన్నికలకు పోవాల్సిన  అవసరమేమి వచ్చిందని ఆమె ప్రశ్నించారు.