చంపేసి.. నష్టపరిహారాలిచ్చి చేతులు దులుపుకుంటున్నారా.?

ఆంధ్రప్రదేశ్‌లో ఓ చిన్నారి హత్య జరిగింది. మరీ దారుణంగా పదో తరగతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. తగలబెట్టేశారు ఆ విద్యార్థిని పాపం. పగవాడిక్కూడా రాకూడని కష్టం ఇది. వైసీపీ కార్యకర్త ఒకరు ఈ దారుణానికి ఒడిగట్టాడు. మొత్తం నలుగురు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది.

బాధిత చిన్నారి చేసిన పాపం, తన సోదరి మీద ఆకతాయిలు చేస్తున్న వెకిలి చేష్టల్ని తట్టుకోలేకపోవడమే. అడ్డంగా వున్నాడని, అడ్డు తొలగించేసుకున్నారు నర రూప రాక్షసులు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గుర్ని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.

వైసీపీ నేత.. పైగా ఎంపీ కూడా అయిన ఓ పెద్దాయన, లక్ష రూపాయల నగదు తీసుకుని, బాధిత కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ‘మేమే మీకు లక్ష రూపాయలు ఇస్తాం.. మా బిడ్డని చంపినోడికి శిక్ష వేయండి..’ అంటూ బాధిత కుటుంబంతోపాటు, ఆ గ్రామమంతా నిలదీసింది.

చిత్రమేంటంటే, ఈ ఘటనలో ఎవరూ ‘జస్టిస్ ఫర్’ అనే హ్యాష్ ట్యాగ్స్‌తో స్పందించలేదు. సినీ ప్రముఖులు కావొచ్చు.. సామాజిక కార్యకర్తలు కావొచ్చు.. ఎందుకు స్పందించలేదు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం.. ఇలాంటి ఆఫర్లను ప్రభుత్వం ప్రకటించేసింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం మంచిదే. కానీ, నేరస్తుడికి శిక్ష పడాలి. అది కదా ప్రభుత్వం చెయ్యాల్సిన పని.?