నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? ఔను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై జనం అనుకుంటున్నది ఇదే. ఏ పార్టీ గొడవకు కారణమైంది.? అన్నది వేరే చర్చ. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తమ స్థాయిని దిగజార్చేసుకున్నాయి. సభలో ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. దానికి మళ్ళీ ‘దలిత’ రంగు పులిమారు.
ఎమ్మెల్యేలు కొట్టుకోవాలనుకుంటే, రాష్ట్రంలో చాలా క్రీడా మైదానాలున్నాయి. మీడియా ముందు ఎలాగూ నిత్యం మాటలతో కొట్టుకుంటూనే వున్నారు.. అదీ నిస్సిగ్గుగా.! తాము ప్రజా ప్రతినిథులమన్న విషయాన్ని ఏనాడో మర్చిపోయారు రాజకీయ నాయకులు. మనుషులమన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు.. అదే అసలు సమస్య.
టీడీపీ కావొచ్చు, వైసీపీ కావొచ్చు.. ఇలాంటోళ్ళకు అసలు టిక్కెట్లు ఎందుకు ఇస్తున్నట్లు.? టీడీపీ దాడి చేసిందని వైసీపీ, వైసీపీ దాడి చేసిందని టీడీపీ.. వెరసి, రెండు పార్టీలూ చాలా సిల్లీగా ఆరోపించుకుంటున్నాయి. నిస్సిగ్గుగా సోషల్ మీడియాలో బరితెగిస్తున్నాయి. అంతిమంగా పోతున్నది రాష్ట్రం పరువు ప్రతిష్టలే.
‘టీడీపీ ఎమ్మెల్యే దాడి చేశారు..’ అని వైసీపీ, ‘వైసీపీనే దాడి చేసింది’ అంటూ టీడీపీ.. సోషల్ మీడియా వేదికగా చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. ‘ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇంత ఛండాలంగా నడుస్తోందా..’ అంటూ జనం ఛీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. కోట్లు ఖర్చువుతున్నాయి చట్ట సభల నిర్వహణకి.
150 మందికి పైగా ఎమ్మెల్యేలున్న అధికార పార్టీపై, పాతిక మంది కూడా ఎమ్మెల్యేలు లేని ప్రతిపక్షం దాడి చేయగలుగుతుందా.? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. తప్పెవరిది.? అన్నది వేరే చర్చ. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పరువు పోయింది. సిగ్గు పడాల్సింది మొత్తం సభ.!