ఏపీ-తెలంగాణ డివైడ్ ఘట్టాన్ని తెలుగు ప్రజలు ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆంధ్రా ప్రముఖులకు చెందిన సినీపరిశ్రమ వైజాగ్ కి తరలి వెళ్లిపోతోందని ప్రచారమైంది. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా మేరకు పరిశ్రమ ఎటూ వెళ్లలేదు. అయితే విభజనకు ముందు తెలంగాణ బ్రాండ్ టాలీవుడ్ సృష్టికోసం స్థానిక నాయకులు చేసిన ప్రతిజ్ఞల్ని ఎవరూ మర్చిపోలేరు. ఆ క్రమంలోనే ప్రత్యేకించి హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో భారీగా స్టూడియోల నిర్మాణం చేపట్టాలని భూసేకరణ కోసం భూముల్ని పరిశీలించిన సంగతి తెలిసిందే. పూణే తరహా ఫిలింఇనిస్టిట్యూట్ ఏర్పాటు ప్రతిపాదనను తెరాస సర్కార్ తెచ్చింది. అదే టైమ్ లో ప్రముఖ తెలంగాణ దర్శకుడు ఎన్.శంకర్ తన సొంత స్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వాన్ని భూమి కోసం అభ్యర్థించారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిన ఎన్.శంకర్ కి తెరాస ప్రభుత్వం ఐదెకరాల్ని కేటాయిస్తూ జీవోని జారీ చేసింది.
అయితే దీనిపై చాలా కాలం క్రితం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎకరం రూ.5 కోట్ల విలువైన భూమిని రూ.5 లక్షల చొప్పున ఐదెకరాలను కేటాయించడంపై హైకోర్టులో కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్- న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇదే తరహాలో ప్రభుత్వం పలువురికి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని తక్కువ ధరలకే కేటాయించడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాలు హైకోర్టు విచారణలో ఉన్నాయని వెల్లడించారు. ఆ కేసులన్నింటనీ గంపగుత్తగా ఒకేసారి విచారిస్తామని.. ఈ కేసుల్లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదిగా చేస్తున్నామని తెలిపింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
ఇక ఆ ఐదెకరాల భూమిని ఎన్.శంకర్ కి కేటాయిస్తూ జీవో జారీ చేయడాన్ని సమర్థించుకుంటూ వివరణ ఇవ్వాల్సిందిగా తెరాస ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. రెండు వారాల్లో దీనిపై పూర్తి విచారణ సాగనుందని వెల్లడించింది. ఇక ఆ జీవో రద్ధుపై కోర్టు తేల్చాల్సి ఉంటుంది. ఇక ఎన్.శంకర్ కి కేటాయించిన సినీ స్టూడియో స్థలం ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలోని నివాస యోగ్యమైన ప్రాంతంలో ఖరీదైన భూమిని కేటాయించడమే ఈ వ్యాజ్యానికి కారణమైంది.
