ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సీఎం జగన్ వైఎస్సార్ పేరు పెట్టడం విషయంలో టీడీపీ నేతల నుంచి విమర్శలు వ్యక్తం కావడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టీడీపీ నేతలు ఎవరికి నచ్చిన రీతిలో వారు జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు. జగన్ నిర్ణయం వైసీపీ నేతలలో చాలామందికి నచ్చకపోయినా వాళ్లు జగన్ ను మెచ్చుకునే ప్రయత్నం చేశారే తప్ప విమర్శించడానికి అస్సలు ప్రయత్నించలేదు.
అయితే షర్మిల మాత్రం జగన్ చేసింది తప్పేనని కుండబద్దలుగొట్టారు. వాస్తవానికి ఈ వివాదం గురించి షర్మిల స్పందించినా స్పందించకపోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే జగన్ తో ఆస్తులకు సంబంధించిన విభేదాలు ఉండటం వల్లే ఆమె ఈ విధంగా స్పందించి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల నెగిటివ్ కామెంట్ల వల్ల వైసీపీకి నష్టమే తప్ప ఏ మాత్రం లాభం కలగదనే సంగతి తెలిసిందే.
షర్మిల జగన్ తమ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటే మంచిదని చాలామంది సూచనలు చేస్తున్నారు. చిన్నచిన్న విషయాలకు జగన్ షర్మిల వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేయడం వల్ల ప్రజలలో వీళ్లిద్దరూ చులకన అయ్యే అవకాశం అయితే ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. విజయమ్మ సైతం జగన్, షర్మిల మధ్య బేధాభిప్రాయాలను తొలగించే దిశగా అడుగులు వేయాల్సి ఉంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలకు సంబంధించి తెగేదాకా లాగుతున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ కాకుండా మరో పార్టీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మళ్లీ మారే అవకాశం ఉంటుంది. షర్మిల సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. షర్మిల చేసిన కామెంట్లపై జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.