పవన్‌కు రాజ్యసభ సీటు.. చంద్రబాబు ఆఫర్ నిజమేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో జనసేన నుంచి ఎన్నికల్లో పోటి చేయకుండా బిజెపి టిడిపి కూటమిలకు అనుకూలంగా పవన్ ప్రచారం చేశారు. ఇచ్చిన హామీలను విస్మరించడంతో వారితో పవన్ విబేధించారు. అప్పటి నుంచి ప్రభుత్వంపై ,చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ఉద్యమిస్తున్నారు. ప్రజాపోరాట యాత్రలు చేస్తూ ముందుకు కదులుతున్నారు. అయితే తాజాగా పవన్ అమరావతిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

2014 ఎన్నికల్లో జనసేన పోటి చేయకుండా ఉండాలని అలా చేస్తే తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు హామీనిచ్చారు. ఈ విషయంపై గోప్యత పాటించాలని కూడా చెప్పారు. ఆ మరుసటి రోజే రెండు పేపర్లకు లీకులిచ్చి విషయాన్ని బయటకు పొక్కేలా చేశారని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఆరోజే తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబుపైన నమ్మకం పోయిందని ఆ తరువాతే బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీని కలిశానని పవన్ తెలిపారు.

2012లోనే చంద్రబాబును కలిసి రాజకీయ పార్టీ గురించి చర్చించానని, అప్పుడు ఆయన ఓట్లు చీలుతాయని భయపడి ఆందోళనతో పోటి చేయవద్దని సూచించారని పవన్ చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క లోకేష్ కే ఉద్యోగం వచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు. అందరికి ఉపాధి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని పవన్ ప్రశ్నించారు. లోకేష్ సీఎం అయితే తనకేమి అభ్యంతరం లేదని కానీ రాష్ట్రమేమవుతుందో అని భయమవుతుందని ఎద్దేవా చేశారు. పుట్టుకతోనే ఎవరికీ రాజకీయానుభవం ఉండదని తనకు రాజకీయానుభవం లేదు అన్న వారికి పవన్ చురకలు అంటించారు. కిందపడ్డా, మీదపడ్డా చివరకు జనసేనదే అధికారమని పవన్ అన్నారు.

పవన్ వ్యాఖ్యలతో అంతా చర్చించుకుంటున్నారు. పవన్ ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు ఈ విషయాలు బయటపెడుతున్నారనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే పవన్ అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారని ఎన్నికల కోణంలోనే ఆయన అన్ని విషయాలు బయటపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఒక పార్టీ అధినేత రాజ్యసభ సీటుకు ఒప్పుకోవడమేంటని, దాంతోనే అతని పార్టీ విధానం తెలుస్తుందని మరికొందరంటున్నారు. పోరాడాల్సిన వారు, పార్టీకి అధినేతగా ఉన్నారు అంటే ఉన్నత పనులు చేసి ఉన్నత స్థానానికి చేరుకోవాలి కానీ ఇలా దిగజారి వ్యవహరించడమేంటని విమర్శలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కావాలనే ఒక్కో విషయాన్ని బయట పెట్టుకుంటూ వస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశాన్ని ఎదుర్కునేందుకే పవన్ ఈ కొత్త స్కెచ్ వేస్తున్నారని అర్ధమవుతుంది. అందుకే తెలుగుదేశంతో కలిసి ఉన్నప్పుడు జరిగిన రహస్య ఒప్పందాలన్నింటిని పవన్ బయటపెడుతున్నారు. జనసేన అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే పవన్ టిడిపిపై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం నేతలు అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ నేతగా మారాడు అనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే నేతలు రాజకీయ స్వార్ధం కోసం ఎటువంటి వ్యాఖ్యలైనా చేస్తారు. వాటిని అవసరమైనప్పుడు వాడుకొని లాభపడాలని చూస్తుంటారు. అలాగే పవన్ కూడా టిడిపిపై వ్యతిరేకత తీసుకురావడానికి వేస్తున్న స్కెచ్ అని టిడిపి నేతలు అంటున్నారు.