దేవినేని ఉమామహేశ్వరరావు.. టీడీపీలో ప్రముఖమైన వ్యక్తి. దశాబ్ద కాలంపాటు తెలుగుదేశంలో ఈయన మాట వేదవాక్కుగా చెలామణీ అయింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన దేవినేని ఉమా కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా మారిపోయారు. జిల్లాలో ఆయన చెప్పిందే వేదంగా నడిచింది. నందిగామ నుండి రెండుసార్లు, మైలవరం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమా గత ప్రభుత్వంలో మంత్రిగా కూడ పనిచేశారు. కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ముఖ్యంగా విజయవాడలో ఉమాకు మంచి కేడర్ ఉంది. అందుకే జిల్లా నుండి కొమ్ములు తిరిగిన నాయకులు అనేకమంది ఉన్నా ఉమా ఇష్టానుసారమే అంతా జరిగేది.
గత ఐదేళ్ల కాలంలో జిల్లా రాజకీయాలను పూర్తిగా ఉమా చేతుల్లోనే పెట్టేశారు చంద్రబాబు. చంద్రబాబుకు ఆంతరంగిక వ్యక్తి కావడం మూలాన ఉమా హవా ఎలాంటి ఆటంకం లేకుండా నడిచింది. కానీ బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయినట్టు గత ఎన్నికల్లో మైలవరం నుండి పోటీచేసిన ఉమా వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో 12 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుండి ఆయన చరిష్మా మసకబారింది. జగన్ సీఎం కావడంతో ఉమా స్పీడుకు బ్రేకులు పడ్డాయి. అంతవరకు జిల్లా మొత్తం తనదే అన్నట్టు వ్యవహరించిన ఉమా ఇప్పుడు మైలవరానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం వచ్చే ఎన్నికల్లో మైలవరం నుండి గెలవడం ఎలా అనే విషయం మీదనే ఉంది.
అందుకే పక్క నియోజకవర్గాల జోలికి పెద్దగా వెళ్లడంలేదు. దీంతో విజయవాడను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నారు కేశినేని నాని. విజయవాడ లోక్ సభ స్థానం నుండి గత ఎన్నిక్కలో జగన్ హవాను తట్టుకుని గెలిచారు ఆయన. జిల్లా మొత్తం ప్రాభవం లేకపోయినా విజయవాడలో కేశినేని పార్టీతో సంబంధంలేని శ్రేణులు ఉన్నాయి. అందుకే పార్టీలో ఎన్ని రాజకీయాలు జరిగినా విజయవాడ మీద పట్టు నిలుపుకోగలుగుతున్నారు. గతంలో కేశినేని కూడ అందరిలాగానే ఇష్టం లేకపోయినా ఉమా మాటకు కట్టుబడ్డవారే. కానీ ఇప్పుడు తాను పదవిలో ఉండటం, ఉమా ఒట్టి చేతుల్తో మిగలడంతో నానికి పార్టీ స్వేచ్ఛ లభించినట్టైంది. ఉమా మైలవరంలో కూర్చొని జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో బెజవాడలో పార్టీని కంట్రోల్ చేయాలని చూసినా నాని అడ్డంగా నిలుస్తున్నారు. ప్రజెంట్ అక్కడ పార్టీ అంతా నాని మాట మీదే నడుస్తున్నారు. కొన్ని నెలల వ్యవధిలోనే తలకిందులైన ఈ పరిస్థితులను ఉమా సైతం నమ్మలేకపోతున్నారట.