ఒకటి తిట్టి, నాలుగు తిట్టించుకోవడంలో వున్న సంతృప్తి ఏంటోగానీ, ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో దేవినేని ఉమామహేశ్వరరావుకి ఈ విషయంలో ప్రత్యేకమైన అనుభవం వుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు దేవినేని ఉమామహేశ్వరరావు. 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన దేవినేని ఉమ, అడపా దడపా తన ఉనికి కోసం పబ్లిసిటీ స్టంట్లు చేసేస్తుంటారు. పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి వైఎస్ జగన్ ప్రభుత్వంపై చీటికీ మాటికీ విమర్శలు చేయడం, అట్నుంచి వచ్చే తిట్లతో ఎంజాయ్ చేయడం ఆయనకి అలవాటైపోయింది. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద దేవినేని ఉమ విమర్శలు చేస్తే, ఆయన ఆశించిన స్థాయిలో అట్నుంచి రెస్పాన్స్ ఘాటుగానే వచ్చేసింది. ‘ఆడ మగ కాని ఉమ.. సోడాలు కొట్టుకునే బతుకు నీది..’ అంటూ దేవినేని ఉమామహేశ్వరరావుపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడిపోయారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే ఊరుకునేది లేదనీ, కులం పేరు చెప్పి విమర్శలు చేస్తే అస్సలు ఊరుకోననీ వార్నింగ్ ఇచ్చేశారు అనిల్ కుమార్ యాదవ్.
మంత్రి గనుక అనిల్ కుమార్ యాదవ్ కాస్త, తన మాటల్ని అదుపులో పెట్టుకుని పద్ధతిగా విమర్శలు చేసి వుంటే బావుండేదేమో. ఇక, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాల్ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమవుతోంది. నాణ్యతలో డొల్ల.. అనే విమర్శలు వెల్లువెత్తుతోంటే అది చంద్రబాబు పాపమేనని వైసీపీ అంటోంటే, తూచ్.. అది వైఎస్ జగన్ నిర్లక్షానికి ఫలితమని టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. దేవినేని ఉమ మంత్రిగా వున్న సమయంలో ఎలాగైతే పోలవరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయో, అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా వున్నప్పుడూ పోలవరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు తగ్గడంలేదు.