పవన్ ని ఫాలో అవుతున్న ఉమ… సరికొత్త నాటకం?

వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేసేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశారని.. కానీ వాటి నుంచి తాను తప్పించుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఈ కామెంట్లపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.

అవును… నిన్నమొన్నటివరకూ తనకు ప్రాణహాని ఉందని, తనను చంపించడానికి సుపారీ కూడా ఇస్తున్నారనే సమాచారం తనవద్ద ఉందని జనసేన అధినేత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాలపై స్పందించిన వైసీపీ నేతలు… అదే నిజమైతే డీజీపీని కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అప్పటినుంచి పవన్ మళ్లీ ఆ టైపు ఆరోపణలు చేసినట్లు కనిపించలేదు!

ఇదే క్రమంలో… ఇటీవల కొండపల్లిలో తన మీద తన కారు మీద వైసీపీ శ్రేణులు దాడి చేశాయని చెబుతున్నారు దేవినేని ఉమ. ప్రజాక్షేత్రంలో తేల్చుకునే దమ్ములేని వారే తనపై కుట్రలు చేస్తున్నారని దేవినేని పెద్ద పెద్ద మాటలు అన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇది అంతా డ్రామా అని, పెద్ద ట్రాష్ అని పలువురు అంటుంటే… టీడీపీ అంతర్గత పోరులో భాగంగా జరుగుతున్నాయేమో అనే సందేహం మరికొఇందరు వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మైకందుకున్న ఉమ… తన జీవిత ఆశయం ఒక్కటేనని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన చింతలపూడి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీటిని నాగార్జున సాగర్ కాలువల్లో పారిస్తానని చెప్పారు. కాగా… పోలవరం ప్రాజెక్ట్ తమ ప్రభుత్వంలోనే పూర్తవుతుందని గతంలో అసెంబ్లీలో మాట్లాడిన దేవినేని ఉమ… “రాసుకో జగన్… పోలవరం పూర్తిచేస్తాం” అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే… టీడీపీ హయాంలో అది పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందనే కామెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ సంగతి అలా ఉంటే… ఉన్నపలంగా తన హత్యకు కుట్ర, తనకు ప్రాణహాని ఉందని చెబుతున్న దేవినేని ఉమ వ్యాఖ్యల వెనక మరో కథ ఉందని అంటున్నారు పరిశీలకులు. ఈ ద‌ఫా మైల‌వ‌రం టికెట్ దేవినేని ఉమకు దక్కే ఛాన్స్ లేదని అంటున్నారు. మైల‌వ‌రంలో ఉమాకు వ్య‌తిరేకంగా టీడీపీలో బ‌ల‌మైన వ‌ర్గం త‌యారవ్వడంతోపాటు.. సర్వే ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

దీంతో… ఎలాగైనా టికెట్‌ ను సాధించుకోవ‌చ్చనే వ్యూహంతోనే దేవినేని ఉమామహేశ్వర రావు ఇలా స‌రికొత్త నాట‌కానికి తెర‌లేపార‌ని అంటున్నారు. నిజంగా త‌న‌కు ఎవ‌రి నుంచేనా ప్రాణాపాయం ఉంటే ముందుగా పోలీస్ అధికారుల‌కు ఫిర్యాదు చేయాలే త‌ప్ప, రాజ‌కీయం కోసం మైకుల ముందు మాటలు ఎందుకని సూటిగా ప్రశ్నిస్తున్నారు.