ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడకం ఎలా ఉంటుందనేది రాష్ట్ర రాజకీయాల్లో బహుశా భూమా కుటుంబానికి తెలిసినంతగా మరెవరికీ తెలిసి ఉండదు. చంద్రబాబు అధికారంలో ఉన్నా, లేకపోయినా భూమా కుటుంబం మాత్రం ఆయన వాడకానికి బలి అయి తీరుతోంది. ఈ వాడకం అనేది దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితోనే ఆగిపోయి ఉంటే బాగుండేది. అలా జరగలేదు. ఆయన మలి తరానికీ పాకింది.
ఇప్పుడు తాజాగా చంద్రబాబు వాడకానికి బలి అయింది స్వయంగా మంత్రి భూమా అఖిల ప్రియ, ఆమె సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి. చంద్రబాబు తనను పట్టించుకోపోవడంతో గతంలో ఓ సారి భూమా దంపతులు ప్రజారాజ్యంలో చేరారు. ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. సరికదా! కనీస సీట్లను సంపాదించుకోలేదు. దీనితో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి, తల్లి శోభా నాగిరెడ్డి మరణం తరువాత అదే పార్టీ నుంచి ఆళ్లగడ్డ అభ్యర్థిగా పోటీ చేసి, ఇద్దరూ విజయం సాధించారు. అఖిల ప్రియ ఎమ్మెల్యే కావడం అదే తొలిసారి. చంద్రబాబు మంత్రి పదవి ఆశ చూపడంతో భూమా నాగిరెడ్డి తన కుమార్తెతో సహా అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడితో భూమా కుటుంబంతో చంద్రబాబు అవసరం తీరిపోయింది. దీనితో ఆయన నాగిరెడ్డిని పట్టించుకోలేదు.
రోజులు గడిచాయే తప్ప మంత్రి పదవి మాత్రం దక్కలేదు. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించిన తరువాత గానీ.. ఆ కుటుంబానికి మంత్రి పదవి దక్కలేదంటే చంద్రబాబు వాడకం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భూమా నాగిరెడ్డి మృతి తరువాత మంత్రి వర్గాన్ని విస్తరించిన చంద్రబాబు అఖిలను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. పర్యాటక మంత్రిత్వశాఖను అప్పగించారు. నిజానికి- ఈ శాఖ అంటే చంద్రబాబుకు ఎంతో ఇష్టం.
గతంలో ఆయన ఏ ఇజమూ లేదు.. ఒక్క టూరిజం తప్ప అని నిండు అసెంబ్లీలో ప్రకటించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. అలాంటి పదవిలో అఖిలప్రియ రబ్బర్ స్టాంపుగా మిగిలారనే అపవాదు ఉంది. తాజాగా- భూమా కుటుంబ రాజకీయ ప్రత్యర్థిగా భావించే నంద్యాల పాతకాపు ఎన్ఎండీ ఫరూఖ్‌ను మంత్రివర్గంలో చోటు కల్పించడంతో అఖిలకు, ఆమె సోదరుడికి చెక్ పెట్టినట్టయింది.
దీనికితోడు- కార్డన్ సెర్చ్ సందర్భంగా పోలీసులు అఖిల ప్రియ అనుచరుల ఇళ్లలో సోదాలు చేపట్టి, వారిని భయభ్రాంతులకు గురి చేయడంతో పరిస్థితి తారాస్థాయికి చేరుకుంది. దీన్ని నిరసిస్తూ అఖిలప్రియ ప్రభుత్వం రక్షణగా కల్పించిన గన్‌మెన్లను దూరం పెట్టారు. బ్రహ్మానంద రెడ్డి కూడా గన్‌మెన్లను వెనక్కి పంపడం కలకలం రేపింది. కర్నూలు జిల్లాలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి కూడా అఖిలప్రియ దూరంగా ఉన్నారు. స్వయంగా చంద్రబాబే పాల్గొన్న ఆ కార్యక్రమానికి జిల్లా మంత్రిగా ఉన్న అఖిల హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.
ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. `అఖిలకు అనుభవం లేదు. ఆమెది చిన్న వయస్సు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. గన్‌మెన్లను తిప్పి పంపడమేంటి? పార్టీలో ఉండాలనుకుంటే ఉండొచ్చు లేదా ఆమె ఇష్టం. ఈ సమస్యను చంద్రబాబు పరిష్కరించాలి..` అంటూ కటువుగా మాట్లాడారు. తనకు అవసరం అనుకుంటే చంద్రబాబు ఎంతదాకా అయినా వెళ్తారు.
చివరికి కాంగ్రెస్‌తో అయినా జట్టు కడతారు. చారిత్రక అవసరం అంటూ జనాన్ని ఇట్టే నమ్మిస్తారు. అవసరం లేదు అనుకుంటే మాత్రం.. కరేపాకు కంటే హీనంగా చూస్తారు. అది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు అఖిల ప్రియ వ్యవహారంలో అదే జరుగుతోంది. ఇదిలావుండగా- అఖిలప్రియ జనసేన వైపు చూస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలో తనకు మూడు సీట్లు ఇస్తే.. పార్టీలో చేరుతానని ఆమె పవన్ కల్యాణ్‌కు సంకేతాలు పంపించినట్లు చెబుతున్నారు.