ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో అడ్డంగా ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు కూడా నమోదు చేయడానికి సిద్ధమయ్యారు అధికారులు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులపై చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యానికి దిగారు. వారిపై నోటికొచ్చినట్టు మాటల దాడికి దిగారు. ఆ సమయంలో చింతమనేని ప్రభాకర్ మద్యం సేవించి ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి చదవండి.
సోమవారం రాత్రి దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొప్పాక ప్రాంతంలో పోలవరం కుడి కాలువ ప్రాంతం లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపణలు రావడంతో తవ్వకాలను అడ్డుకున్నారు అధికారులు. ఒక ప్రొక్లెయిన్, నాలుగు లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేసారు విజిలెన్స్ అధికారులు. విషయం తెలుసుకున్న చింతమనేని ఆగ్రహంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి వెళ్లి అధికారులపైన తనదైన శైలిలో పరుష పదజాలంతో దాడి చేసారు.
మావాళ్ల బళ్లనే సీజ్ చేస్తారా? మావాళ్లపైనే కేసులు పెడతారా? అంటూ ఆయనకు ఎంతో సునాయాసంగా వచ్చే బూతు పదజాలాన్ని మరోమారు విజిలెన్స్ అధికారులపై ప్రయోగించారు. ఆ తరువాత 100 మందికిపైగా ఊరు జనాన్ని అధికారులపైకి ఉసిగొల్పినట్టు తెలుస్తోంది. దీంతో విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లారు సదరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు.
ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే వాయిస్ కోసం వేచి ఉన్న జర్నలిస్టులపైనా చింతమనేని కస్సుమన్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన వారిని కూడా దుర్భాషలాడారు. ఒక్కొక్కరిని కళ్ళు ఉరిమి చూస్తూ తిట్టుకుంటూ తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో కింద ఉంది చూడండి.