పెద్ద నోట్ల రద్దుతో దేశానికి పెద్ద కష్టం.!

Demonetization

పెద్ద నోట్ల రద్దుతో దేశంలో పెను మార్పులు వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. రాత్రికి రాత్రి పెద్ద నోట్లను రద్దు చేసి.. అంతకన్నా పెద్ద నోట్లను తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. జనం తమ డబ్బుని బ్యాంకుల నుంచి తీసుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడాల్సి వచ్చింది.

బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద క్యూ లైన్లలో నిలబడి చాలామంది జనం ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రుల్లో వైద్య చికిత్స కోసం డబ్బులు అవసరమైనవారు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆనాటి ఆ పరిస్థితుల్ని గుర్తు తెచ్చుకుంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికీ వెన్నులో వణుకు పుడుతుంది.

‘పోన్లే, పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం బయటకు వస్తుంది.. ఇకపై దొంగ నోట్ల సమస్య వుండదు.. నల్ల ధనం బయటకు వస్తే.. అదంతా దేశ ఖజానాలో చేరుతుంది.. అప్పుడు దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది..’ అంటూ జనం అప్పట్లో ఆ కష్టాల్ని భరించారు.

కానీ, ఏం జరిగింది.? ఎన్నికల్లో ఓటుకు నోటు వుండదని మోడీ చెప్పారు. కానీ, విచ్చలవిడిగా ఎన్నికల్లో కరెన్సీ పెరిగిపోయింది. పైగా, దొంగ నోట్ల వాడకం కూడా ఎక్కువైపోయింది. నల్లధనం ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖజానాలో జమ కాలేదు.

పెద్ద నోట్ల రద్దు సమయంలో సామాన్యుడికి వంద రూపాయలు దొరకలేదుగానీ, కొందరి ఇళ్ళలో మాత్రం తళ తళ లాడే కొత్త నోట్లు.. అదీ కోట్లాది రూపాయలు బయటపడ్డాయి. వాటికి సంబంధించి నమోదైన కేసుల పరిస్థితి ఏంటన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు.

నోట్ల రద్దుతో చాలా జీవితాలు రద్దయిపోయాయి.. వాటికి జవాబుదారీతనం ఎవరు వహిస్తారు.? మోడీ అబద్ధం చెప్పారు.. దేశ ప్రజల్ని మోసం చేశారన్నది ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.