ప్రజాస్వామ్యం మరీ ఇంతలా ఖూనీ అయిపోతే ఎలా.?

అభ్యర్థులు నామినేషన్ వేసే పరిస్థితి లేకపోతే, అక్కడ ప్రజాస్వామ్యం వున్నట్టా.? లేనట్టా.? అటువైపు ప్రత్యర్థి ఎవరూ లేకుండా, తన చేత్తో కత్తిని పట్టుకుని గాల్లో ఊపేసి, తానే గెలిచినట్లు ప్రకటించుకుంటే, దాన్ని ఏమనాలి.? ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వ్యవహారంలో ఇదే జరుగుతోంది.

విపక్షాల నుంచి ఎవరన్నా పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలతో వెళితే చాలు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, నామినేషన్ పత్రాలు చించేస్తున్నారు. అసలు అధికార పార్టీకి ఎందుకింత ఖర్మ పట్టిస్తున్నారు.? ఈ కుట్ర ఎవరిది.? అధికార వైసీపీకి ప్రజాదరణ వుంది. ఇది ఓపెన్ సీక్రెట్. అలాంటప్పుడు, అధికార పార్టీ నుంచి ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నట్టు.?

ఎవరో కుట్ర పూరితంగా అధికార పార్టీలోనే, అధికార పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారన్నమాట. లేకపోతే, స్థానిక ఎన్నికల వేళ ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా గూండాగిరీ చేయడమేంటి.? చిత్రమేంటంటే, పోలీసులు ఇలాంటి వ్యవహారాల్ని అస్సలు పట్టించుకోవడంలేదు.

ఇదిలా వుంటే, ‘మాకు ఆ ఖర్మ పట్టలేదు. మేం బంపర్ మెజార్టీతో గెలుస్తాం.. విపక్షాలే అనవసరపు యాగీ చేస్తున్నాయ్..’ అని అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అదే నిజమైతే, నామినేషన్ల దాఖలు సందర్భంగా ఎలాంటి అలజడీ రేగకుండా ప్రభుత్వమే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కానీ, ఆ పరిస్థితి లేదు.

రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. ఉప ఎన్నికలనగానే దొంగ ఓటర్లు దిగిపోతున్నారు.. స్థానిక ఎన్నికలనగానే ప్రత్యర్థులు నామినేషన్లు వేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. అధికార పార్టీ ఇజ్జత్ తీసే చర్యలకు ఎవరు పాల్పడుతున్నారు.? అన్నది తేల్చాల్సిన బాధ్యత అధికార పార్టీ పెద్దల మీదనే వుంది.