జగన్ మీద ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆగ్రహం… మరో మొట్టికాయ పడేలా ఉంది!

cm jagan

ఆంధ్రప్రదేశ్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ షాకిచ్చింది. న్యాయవ్యవస్థను బెదిరించడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సీఎం జగన్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి హేతుబద్ధత లేదని పేర్కొంది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బాబ్డేకు సీఎం జగన్ లేఖ రాయడాన్ని ఖండిస్తూ ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం తీర్మానం చేసింది.

cm jagan
cm jagan file photo

ఏపీ సీఎం జగన్‌ సీజేఐకి రాసిన లేఖ కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని వమ్ముచేసేలా జగన్‌ లేఖ ఉందని పేర్కొంది. రాజ్యాంగ వ్యవస్థలపై సీఎం జగన్‌ దాడి చేయడం దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేసింది.

సీఎం జగన్ చర్యలు న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తిపై దాడి చేయడమేనని తీవ్ర స్థాయిలో ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. సీజేఐకి రాసిన లేఖను కూడా ప్రజలకు బహిరంగపరచడం నీతిమాలిన చర్య అని సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ పేర్కొంది.