వార్ వన్ సైడ్ అని టిఆర్ఎస్ విజయ గర్వంతో జనాల్లో దూసుకుపోతున్నది. వందకు తగ్గకుండా సీట్లు కొల్లగొడతామని ధీమాతో ఉన్నది. అసెంబ్లీ రద్దు కంటే ముందు నుంచి నిన్న బి ఫారాలు చేతికిచ్చే వరకు గులాబీ దళపతి కేసిఆర్ వంద సీట్లకు తగ్గం అని పదే పదే చెబుతూ వచ్చారు. ఇదంతా బాహటంగా కనిపిస్తున్న ముచ్చట. కానీ లోలోన పెద్ద కథే నడుస్తున్నది.
ఆదివారం సాయత్రం 107 మంది అభ్యర్థులకు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తెలంగాణ భవన్ కు పిలిపించి బి ఫారాలు చేతికిచ్చారు. మంచి రోజు, వాస్తు, జ్యోతిష్యం చూసుకుని అందరూ శుభ గడియల్లో నామినేషన్లు వేయండి అని దీవించి పంపించారు. ఇంతవరకు బాగానే ఉంది. సోమవారం నామినేషన్ల ప్రక్రియ శురూ అయింది. దీంతో సోమవారం తొలిరోజే కాబట్ట ిపెద్దగా ఎవరూ నామినేషన్లు వేయడానికి ఆసక్తి చూపే పరిస్థితి కనిపించడంలేదు. బాస్ చెప్పినట్లు మంచి చెడులు చూసుకుని నిమినేషన్లు వేద్దామని అందరూ తమ తమ తేదీలను ఎంచుకుంటున్నారు.
ఇంతలోనే పిడుగు లేని ఉరుములా టిఆర్ఎస్ రెబెల్ సీన్ లోకి ఎంటరయ్యారు. ఉప్పల్ టిఆర్ఎస్ నేత నందికొండ శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీ చేపట్టారు. మధ్యాహ్నం 12 గర్వాత ఆయన నామినేషన్ వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో తెలంగాణలోనే తొలి నామినేషన్ టిఆర్ఎస్ రెబెల్ దే కాబోతున్నది.
నందికొండ శ్రీనివాస్ రెడ్డి రికార్డు
2018 అసెంబ్ల ీఎన్నికల చరిత్రలో శ్రీనివాసరెడ్డి రికార్డు సృష్టించబోతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే టిఆర్ఎస్ అధికారిక అభ్యర్థులు కాకుండా ఒక రెబెల్ నామినేషన్ వేయడం ఆ పార్టీకి ఊహించని షాక్ గానే చెబుతున్నారు. ఇప్పటికే గులాబీ జెండాలు చేతబట్టి జై కేసిఆర్ అంటూ జై శీనన్న అంటూ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. హబ్సిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి ఉప్పల్ వైపు ర్యాలీ సాగుతోంది.
ఉప్పల్ సీటును టిఆర్ఎస్ నేత బేతి సుభాస్ రెడ్డికి కేసిఆర్ కేటాయించారు. గత టర్మ్ లోనూ బేతి సుభాష్ రెడ్డికే కేటాయించినా ఆయన ఓటమిపాలయ్యారు. తర్వాత జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో బేతి సుభాష్ రెడ్డి సతీమణి కార్పొరేటర్ గా గెలిచారు. ఇదిలా ఉంటే గతసారి చిత్తు చిత్తుగా ఓడిపోయిన బేతి సుభాష్ రెడ్డికే మళ్లీ ఎలా టికెట్ ఇస్తారని నందికొండ శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. దొంగచాటుగా టికెట్ తెచ్చుకున్న బేతిని డిపాజిట్ దక్కకుండా ఓడించి తన సత్తా ఏంటో నిరూపిస్తానని శ్రీనివాస్ రెడ్డి చాలెంజ్ చేస్తున్నారు.
తెలంగాణా రాష్ట్ర సమితి నుండి టికెట్ ఆశించి నిరాశ పడ్డాడు నందికొండ శ్రీనివాస్ రెడ్డి. అందుకే తాను వేరే పార్టీల్లో చేరకుండా రెబల్ అభ్యర్థి గా నామినేషన్ వేయడానికి రెడీ అయ్యారు. హబ్సిగూడ నుండి భారీ ర్యాలీ తో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో తెలంగాణా రాష్ట్రం లోనే ఇది తొలి నామినేషన్ గా నమోదు కానుంది. తెలంగాణ ఉ్యమకారులను కాదని కొత్త వారికి ఇవ్వడం కరెక్ట్ కాదని నందికొండ శ్రీనివాస్ రెడ్డి వాపోయారు. ఉద్యమంలో పాల్గొని వయసు తో పాటు, డబ్బు పోయిందని ఇంత చేసినా ఇప్పటికైనా తనకు టికెట్ ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
ఇప్పటికైనా టిఆర్ఎస్ అధిష్టానం తనను అధికారిక అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. తొలి నామినేషన్ వేసి రికార్డు నెలకొల్పినట్లే తొలి గెలుపుతో మరో రికార్డు నెలకొల్పబోతున్నట్లు నందికొండ ధీమా వ్యక్తం చేశారు.
నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీ చేపట్టిన సందర్భంగా నందికొండ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఆయనే కామెంట్స్ ఒకసారి కింద వీడియోఃల్లో చూడండి.