చంద్రబాబునాయడును నమ్ముకున్న వారు చివరకు ముణగటమే కానీ తేలటం ఉండదని తాజాగా మరోసారి రుజువవుతోంది. పోయిన ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని కర్నూలు ఎంపిగా వైసిపి తరపున పోటీ చేసి గెలిచిన బుట్టా రేణుక పరిస్దితి రెంటికి చెడ రేవడిలాగ తయారైంది. పార్టీలోకి తీసుకునేటపుడు మిగితా వాళ్ళకు ఇచ్చినట్లుగానే బుట్టాకు కూడా హామీలు చాలానే ఇచ్చారులేండి. ఇచ్చిన అనేక హామీల్లో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎంపి టిక్కెట్టివ్వటంతో పాటు ఖర్చులు కూడా పెట్టుకుంటానని చెప్పారట. తీరా ఎన్నికలు ముంచుకొస్తున్నాయనగా బుట్టాకు చంద్రబాబు పెద్ద హ్యాండే ఇచ్చారు.
కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న కోట్ల సూర్యప్రకాశరెడ్డిని టిడిపిలోకి చేర్చుకుంటున్నారు. అంటే ఏమనర్ధం ? రాబోయే ఎన్నికల్లో కోట్లకే కర్నూలు ఎంపి టిక్కెట్టనే. ఎంపి టిక్కెట్టుతో పాటు పాణ్యం లేదా డోన్ అసెంబ్లీ టిక్కెట్టు కూడా ఇవ్వబోతున్నారట. అంటే 1 ప్లస్ 1 హామీని కోట్లకు చంద్రబాబు ఇచ్చేశారు. దాంతో కోట్ల కుటుంబం తెలుగుదేశంపార్టీలో చేరుతోంది. దాంతో బుట్టాకు పెద్ద షాక్ అనే చెప్పాలి. కోట్ల కుటుంబం టిడిపిలోకి చేరే విషయం హఠాత్తుగా తెరపైకి వచ్చింది.
నిజానికి టిడిపి, కాంగ్రెస్ పొత్తులుండాల్సింది. ఎప్పుడైతే తెలంగాణాలో రెండు పార్టీల అపవిత్ర పొత్తుతో చంద్రబాబుకు తలబొప్పి కట్టిందో అప్పుడే ఏపి ఎన్నికల్లో ప్రత్యక్షంగా కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు వెనక్కుతగ్గారు. టిడిపితో పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపిగా గెలిచేద్దామని కోట్ల అనుకున్నారు. ఎప్పుడైతే పొత్తులుండవని కాంగ్రెస్ చీఫ్ రాహూల్ గాంధి నిర్ణయించారో అప్పుడే టిడిపిలోకి వెళ్ళాలని కోట్ల డిసైడ్ అయ్యారు. అంటే కోట్ల కాంగ్రెస్ లోనే ఉన్నా, టిడిపిలో చేరినా బుట్టా విషయంలో రిజల్టయితే సేమ్.
బుట్టాకైతే ఎంపి టిక్కెట్టు రాదనేది ఖాయమైపోయింది. మరిపుడు బుట్టా ఏం చేస్తుందనేది సస్పెన్సే. కాకపోతే ఎప్పటికప్పుడు తప్పించుకోవటానికి అప్పటిప్పుడే ఏదో ఓ హామీ ఇచ్చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఈ పాటికే బుట్టాకు ఏదో హామీ ఇఛ్చే ఉంటారనటంలో సందేహం లేదు. ఎంపిగా తప్ప ఎంఎల్ఏగా పోటీ చేసేది లేదని బుట్టా ఒకపుడు పట్టుబట్టి కూర్చున్నారు. వైసిపిలో ఉన్నపుడు కూడా బుట్టాది ఇదే తంతు. కాబట్టి టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత కూడా అదే పట్టు మీదుంది. అయితే, ఎంపి టిక్కెట్టు కోట్లకు ఖాయమైపోయింది కాబట్టి ఇపుడు బుట్టా ఏమి చేస్తుందో చూడాలి.