చూడబోతే చంద్రబాబునాయుడుకు ఫిరాయింపు మంత్రులు, ఫిరాయింపు ఎంఎల్ఏలే దిక్కులాగున్నారు. చంద్రబాబుపై మూడు రోజుల క్రితం వైసిపి అవినీతి చక్రవర్తి పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. సరే అందులో ఉన్నవి చాలా వరకూ అందరూ చెప్పుకుంటున్న విషయాలే లేండి. వైసిపి పుస్తకం వేయటంతో పాటు దాన్ని పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి విడుదల చేయటంతో కాస్త ఇంపార్టెన్స్ వచ్చిందంతే. మరి ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసిన తర్వాత అధికార పార్టీ ఊరుకుంటుందా ? అందులోను తెలుగుదేశంపార్టీ ? పుస్తకం విడుదలైన రెండు రోజుల తర్వాత జగన్ పై మంత్రులు, టిడిపి ఎంఎల్ఏలు రెచ్చిపోయారు.
జగన్ పై టిడిపి ఎదురుదాడి చేయటం వరకూ బాగానే ఉంది కానీ అసలు సమస్యంతా ఇక్కడే వచ్చింది. టిడిపి తరపున జగన్ పై ఎదురుదాడి చేసిన వాళ్ళంతా వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన వాళ్ళే కావటం గమనార్హం. ఫిరాయింపు మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమరనాధరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియతో పాటు మరో 18 మంది ఫిరాయింపు ఎంఎల్ఏల పేర్లతో టైపు చేసిన పత్రికా ప్రకటనను విడుదల చేసింది టిడిపి. కనీసం వారి సంతకాలు కూడా లేవు. గుంటూరు జిల్లా ఎన్టీయార్ భవన్ కార్యాలయం నుండి విడుదలైన పత్రికా ప్రకటనలో ఫిరాయింపుల పేర్లు తప్ప ఇంకే పార్టీ నేత పేరు కూడా లేదు.
జగన్ పై ఒంటికాలిపై లేచే మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు , యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళతో పాటు బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు, అనిత, బుచ్చయ్య చౌదరి లాంటి ప్రజా ప్రతినిధులు చాలామందే ఉన్నారు. అటువంటి వారందరినీ కాదని అందులోను ఎవరి సంతకాలు లేకుండానే పత్రికా ప్రకటన విడుదల చేయటమంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే జగన్ ను తిట్టాలంటే ఫిరాయింపులైతేనే బాగుంటుందని చంద్రబాబు అనుకున్నట్లున్నారు. అందుకనే జగన్ కు వ్యతిరేకంగా ఫిరాయింపులనే తెరమీదకు తెచ్చారు.