లెక్క తేల్చేస్తాను…సీరియస్ వార్నింగ్

తన తండ్రి, దివంగత ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టిన అధికారుల లెక్క తేలిపోవాల్సిందే అంటున్నారు ఫిరాయింపు మంత్రి అఖిలప్రియ. నంద్యాల మండలంలో దత్తత తీసుకున్న కొత్తపల్లి గ్రామంలో మంత్రి అఖిలప్రియ పర్యటించారు. ఆ సందర్భంగా తాము వైసిపిలో ఉన్నపుడు జరిగిన సంఘటనలను జ్ఞాపకం తెచ్చుకున్నారు. అప్పట్లో తాము వైసిపిలో ఉన్నపుడు తన తండ్రి భూమా నాగిరెడ్డిపై అధికారులు అక్రమంగా కేసులు పెట్టినట్లు గుర్తుచేసుకున్నారు. కేసులు పెట్టటం ద్వారా తన తండ్రిని ఉద్దేశపూర్వకంగానే అవమానించినట్లు అఖిల మండిపడ్డారు.

 

తన తండ్రి నంద్యాల పర్యటన సంద్భంగా వివిధ సంరద్భాల్లో అక్రమంగా కేసులు పెట్టి తన తండ్రిని ఇబ్బందులు పెట్టిన అధికారులనందరినీ గుర్తు చేసుకున్నారు. వారందరి లెక్కలను తాను సరిచేస్తానంటూ తీవ్రంగా హెచ్చరించారు.  వారి లెక్క తేల్చేవరకూ తాను విశ్రమించేది లేదని అఖిల శపథం చేయటం ఇపుడు చర్చనీయీంశమైంది. తన దగ్గర అందరి లెక్కలున్నాయని, అందరి లెక్కలను సరిచేస్తానంటున్న అఖిలప్రియ అసలు లెక్కేంటో అర్ధంకావటం లేదు.

 

నిజంగానే తన తండ్రిపై అప్పట్లో అక్రమంగా కేసులు పెట్టిన వారి లెక్కలు తేల్చేయాలని అనుకుంటే ముందు తేల్చాల్సింది చంద్రబాబునాయుడు లేక్కనే. భూకు కుటుంబం వైసిపిలో ఉండగా భూమా నాగిరెడ్డి మీద అక్రమంగా కేసులు పెట్టింది వాస్తవమే. అయితే, పోలీసులు తమంతట తాముగా పెట్టలేదు కదా ? పై నుండి వచ్చిన ఆదేశాలమేరకు కేసులు పెట్టుంటారు. వైసిపిలో ఉండగా అఖిల చంద్రబాబును తీవ్రంగా హెచ్చరించిన విషయం గుర్తుండే ఉంటుంది.

 

తన తండ్రికి ఏమైనా అయితే అందుకు బాధ్యుడు చంద్రబాబే అని స్పష్టంగా చెప్పారు. తాను చంద్రబాబును వదిలేది లేదని ఇప్పుడు చెప్పినట్లే అప్పట్లో కూడా చెప్పారు. మరి తర్వాతేమైందో తెలీదు. తండ్రి, కూతుర్లిద్దరూ టిడిపిలోకి ఫిరాయించారు. తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. మరి ఇప్పడు లెక్క తేల్చేయాలని ఫిరాయింపు మంత్రి అనుకుంటే ముందు ఎవరి లెక్క తేల్చాలో అఖిలే తేల్చుకోవాలి.