63 అంశాలతో జగన్ కేబినెట్ కీలక నిర్ణయాలు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో కీలకమైన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేబినెట్ భేటీలో జగన్ సర్కార్ మరింత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా… మొత్తం 63 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వీటిలో ప్రభుత్వ పెన్షన్ విధానంలో మార్పు, ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ వంటివి కీలకంగా ఉన్నాయి.

ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సీపీఎస్ స్థానంలో జీపీఎస్ (గ్యారెంటీ పెన్షన్ స్కీం) బిల్లు ముసాయిదాను ఇవాళ కేబినెట్ ఆమోదించింది. ఉద్యోగుల భద్రత కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మరింత గుడ్ న్యూస్ లు చెప్పింది ఏపీ సర్కార్. అందులో భాగంగా… కొత్త 12వ పీఆర్‌సీ ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. ఇదే క్రమంలో… 2022 జనవరి 1వ తేదీ నుంచి ఉద్యోగులందరికీ ఏరియర్స్‌ తో 2.73 శాతం డీఏ వర్తింపజేయనుంది.

ఇదే క్రమంలో… రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కూడా తాజాగా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వీటితోపాటు సంక్షేమ పథకాలైన “అమ్మ ఒడి”, “జగనన్న ఆణిముత్యాలు”తో పాటు ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కేబినెట్‌ ఇవాళ్టి భేటీలో.. 6,840 కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇందులో పోలీస్‌ బెటాలియన్‌ లో 3,920 పోస్టులు ఉండగా.. కొత్త మెడికల్‌ కాలేజీల్లో 2,118 సహా మరికొన్ని శాఖల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఇందులో కడప మానసిక వైద్య కళాశాలలో 116 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సీతానగరం పీహెచ్‌సీ అప్‌ గ్రేడ్‌ కు 23 పోస్టులకు, పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌.. డయాలసిస్‌ యూనిట్‌కు 41 మెడికల్‌ ఆఫీసర్ల పోస్టులకు ఆమోదం తెలిపింది.

చిత్తూరు డెయిరీ ప్లాంట్ కు 28 ఎకరాల భూమిని లీజు ప్రతిపాదనకు, ఏపీ పౌరసరఫరాల కార్పోరేషన్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణ సేకరణతో పాటు.. మరి ముఖ్యంగా తాజాగా విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థలకు భూ కేటాయింపులకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

ఇదే సమయంలో… జూన్ 12 నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వాహణకు కేబినెట్ ఆమోదం తెలిపడంతోపాటు… 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్ల వ్యయానికి మంత్రివర్గ సమావేశం ఆమొదముద్ర వేసింది!