నిజమే.. చంద్రబాబు నాయుడులో ఒకప్పుడు ఉన్న దూకుడు ఇప్పుడు లేదు. పార్టీలోని పెద్ద పెద్ద వ్యవహారాలను సైతం చిటికలో తేల్చిపడేసిన తెగువ ఉన్న ఆయన ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో కూడ నిర్ణయం తీసుకోవడానికి జంకుతున్నారు. ఒకప్పుడు ఎంతటి నాయకులైనా బాబుగారు డెసిషన్ తీసేసుకుంటే శిరసా వహించేవారు. కానీ ఇప్పుడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ స్థాయి నేతల విషయంలోనే నీళ్లు నములుతుండటం ఆశ్చర్యకరంగా ఉంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బాబుగారు పెద్ద పులిలా తిరగబడతారని తెలుగు తమ్ముళ్లు భావించారు. అయితే బాబుగారు అలసిపోయిన పులిలా నీరసపడిపోయారు. ఇప్పటికీ చాలా చోట్ల పార్టీకి జరగాల్సిన రిపేర్లు జరగనేలేదు.
అలా మిగిలిపోయిన నియోజకవర్గాల్లో సత్తెనపల్లి కూడ ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కోడెల శివ ప్రసాద రావు వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కోడెల మరణంతో నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నాయకత్వం లేకుండా పోయింది. ఈమధ్య అక్కడి వైసీపీలో చీలిక వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీలోనే ఇంకో వర్గం తయారై అంబటి మీద తిరగబడుతోంది. తాజాగా ఆయన మీద వైసీపీ క్యాడరే అక్రమ మైనింగ్ కేసు పెట్టడం ఇందుకు నిదర్శనం. టీడీపీకి నియోజకవర్గం మీద పట్టు పెంచుకోవడానికి ఇంతకంటే మంచి తరుణం ఇంకొకటి రాదు. సరైన నాయకుడిని నియమించుకుంటే పార్టీ నిలదొక్కుకోగలదు.
కానీ ఆ నాయకుడు ఎవరనేది నిర్ణయించే విషయంలో చంద్రబాబు ఒత్తిడి ఫీలవుతున్నారు. ఇన్ ఛార్జ్ పదవి తనకే ఇవ్వాలని కోడెల కుమారుడు శివరామ్ అండుగుతుంటే లేదు నాకివ్వాలని రాయపాటి వారసుడు రంగబాబు పట్టుబడుతున్నారు. ఇద్దరూ ఎవరికివారు సొంత వర్గాన్ని ఏర్పరుచుకుని రాజకీయం చేస్తున్నారు. వీరిలో ఎవరికి పదవి ఇవ్వాలో తేల్చుకోలేకున్నారు బాబు. ఇద్దరూ ముఖ్యులే కావడంతో ఎవరికీ గట్టిగా చెప్పలేకున్నారు. వీరు చాలరన్నట్టు అబ్బూరి మల్లి, రామస్వామి లాంటి లీడర్లు కూడ పదవి ఆశిస్తున్నారు. వీరిలో ఎవరినీ నొప్పించే సాహసం చేయలేకపోతున్నారు చంద్రబాబు. ఇలా ఒక నియోజకవర్గ ఇన్ ఛార్జ్ విషయంలోనే సాహసం చూపలేకపోతున్న బాబు 2024 లో పీఠం ఎలా దక్కించుకోవడానికి అవసరమైన పెద్ద పెద్ద సాహసాలు చేయగలరా అనే అనుమానం కలుగుతోంది.