బాబు కంటే నాలుగు ఆకులు ఎక్కువే… పురందేశ్వరిపై కామెంట్స్ వైరల్!

ఏపీ రాజకీయాల్లో ఇంతకాలం పెద్దగా మాస్ లీడర్ ఫోకస్ దక్కించుకోలేకో ఏమో కానీ… తాజాగా పురందేశ్వరి రాజకీయ వ్యవహారశైలి చూసినవారికి మాత్రం కొత్త రకాల డౌట్స్ వస్తున్నాయి! ఇందులో భాగంగా కొన్ని విషయాల్లో చంద్రబాబుకంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారా అనే సందేహం కూడా కలుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇంతకాలం కేంద్రంలోనే ఎక్కువగా ఉండిపోవడం వల్ల.. పురందేశ్వరి రాజకీయ వ్యవహార శైలి తెలియలేదని.. ఆమె కూడా చంద్రబాబు తానులో ముక్కే అని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో తాజాగా ఆమె చేసిన ఒక ట్వీట్ తో… ఆమె వ్యవహారశైలిని పూర్తిగా తప్పుపడుతున్నారు నెటిజన్లు! ఇంతకీ ఏమిటా వ్యవహారం అనేది ఇప్పుడుచూద్దాం!

సనాత‌న ధర్మంపై త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… సమానత్వానికి ఆటంకంగా ఉన్న సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని కులాలూ సమానం అని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలను రాజకీయంగా క్యాష్ చేసుకునేపనిలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారని తెలుస్తుంది.

ఈ క్రమంలో స్పందించిన పురందేశ్వరి… భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిన మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాత‌న ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలని చెప్పడం హేయమైన చర్య అని అన్నారు పురందేశ్వరి. ఇదే సమయంలో ఈ చర్యలు భారతదేశంలోని హిందూ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు.

అనంతరం 2010 సంవత్సరంలో హిందూ సంస్ధలను లష్కరే తొయిబా సంస్ధతో రాహుల్ గాంధీ పోల్చి మాట్లాడడం అత్యంత దారుణమని అని పురందేశ్వరి స్పందించారు. దీంతో కీబోర్డులకు పనిచెబుతున్నారు నెటిజన్లు. 2010 లో తమరు ఏ పార్టీలో ఉన్నారో గుర్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు!

ఉద‌య‌నిధి స్టాలిన్‌.. సనాతన ధర్మంపై పురందేశ్వరి స్పందించడం వరకూ ఓకే కానీ… రాహుల్‌గాంధీ 2010లో ల‌ష్కరే తొయిబా సంస్థతో హిందూ సంస్థల‌ను పోల్చి మాట్లాడ్డం దుర్మార్గమ‌ని ఇప్పుడు విమ‌ర్శించ‌డ‌ం మాత్రం ఆమె పచ్చి అవ‌కాశవాద రాజకీయాలకు నిద‌ర్శన‌మ‌ని నెటిజ‌న్లు మండిపడుతున్నారు.

2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ త‌ర‌పున లోక్‌ స‌భ స్థానానికి పోటీచేసి గెలిచిన ద‌గ్గుబాటి పురందేశ్వరి.. 2010లో కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని అడుగుతున్నారు. ఆనాడే రాహుల్ కామెంట్స్‌ ను ఖండించి, మంత్రి ప‌ద‌వికి రాజినామా ఎందుకు చేయలేదో చెబుతారా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీలో ఉంటూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాలని.. అనంతరం మ‌రో పార్టీలో చేరాల‌ని హిందూ ధ‌ర్మం చెప్పిందా అంటూ ఆన్ లైన్ వేదికగా నిల‌దీస్తున్నారు. కేంద్ర మంత్రిగా అవ‌కాశం క‌ల్పించిన రాహుల్‌ గాంధీని విమ‌ర్శించ‌డానికి సైతం వెనుకాడని స్థాయిలో అవకాశవాద రాజకీయమా అంటూ ప్రశ్నిస్తున్నారు.

దీంతో… చంద్రబాబు మొన్న మొడీని తిట్టి.. ఈ రోజు ఇద్దరి ఆలోచనా విధానం ఒకటే అని చెప్పడానికి, పురందేశ్వరి నాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసి, అదే సమయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని ఇప్పుడు పార్టీ మారిన తర్వాత స్పందించడం కూడా అలాంటిదే అని అంటున్నారు! దీంతో… మరిదిగారికంటే ఈ విషయంలో నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్లున్నారనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.