వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఆ నలుగురిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముమ్మాటికీ టీడీపీ అభ్యర్థికే ఓటేసి వుంటారు. ఆనం రామనారాయణరెడ్డి కూడా అంతే. మరి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంగతేంటి.? వుండవల్లి శ్రీదేవి ‘క్రాస్ ఓటింగ్’కి పాల్పడేంత రిస్క్ చేస్తారా.? అంటే, రెండు ఓట్ల విషయంలో ఇంకా సందిగ్ధం వుంది. ‘మాకు తెలిసిపోయింది.. చర్యలు తీసుకున్నాం..’ అని వైసీపీ అంటోంది. కానీ, ఈ సందట్లో ఓ ‘చేప’ చల్లగా జారుకుంది.. అని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
శ్రీదేవి, మేకపాటిలలో ఒకరు వైసీపీకే ఓటేసి వుంటారు. కానీ, వాళ్ళిద్దర్నీ వదిలించుకోవడానికే వైసీపీ ఫిక్సయ్యింది.. ఇది కూడా కొంత కాలం క్రితమే జరిగిన వ్యవహారం. టైమొచ్చింది గనుక, చెయ్యాల్సిన సస్పెన్షన్ చేసి పారేసింది వైసీపీ. ‘నేను బతికిపోయా..’ అని ఆ ఎమ్మెల్యే, తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట ఇప్పుడు.
ఎవరా ఎమ్మెల్యే.? ఏమా కథ.? అంటూ మీడియా, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేనా.? లేదంటే, వైసీపీకి చెందిన ఎమ్మెల్యేనా.? ఈ విషయమై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మరో దఫా ఎలిమినేషన్ ప్రక్రియ వుండబోతోందిట వైసీపీలో. ఎలిమినేషన్ అంటే సస్పెన్షన్ అని.. అందులో మరో ముగ్గురు ఎమ్మెల్యేల పని ఔట్.. అంటున్నారు. ఆ లిస్టులో మొన్న తప్పించుకున్న ‘చేప’ కూడా వుండబోతోందిట.