ఢిల్లీలో జరిగిన ఎన్డీయే మిత్రపక్షాల సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి బీజేపీ నుంచి చంద్రబాబుకి ఆహ్వానం అందలేదు. అయితే ఈ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్… టీడీపీ – బీఇజేపీ – జనసేన కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు!
అయితే ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీఇజేపీ బలోపేతం కోసం మిత్రపక్షాలతో మీటింగ్ పెట్టుకుంటే.. ఆ మీటింగ్ లో పాల్గొనడానికి పవన్ ను రమ్మంటే… ఈయనేమో టీడీపీ గురించి అప్రస్తుత ప్రసంగం చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో సీపీఐ నారాయణ స్పందించారు.
పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి ప్రయాణించడంపై ఆయన ఫైరయ్యారు. ఈ సందర్భంగా… పవన్ ను ఒక “దళారి”గా నారాయణ అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ ఆయనను పావుగా వాడుకుంటోందని మండిపడుతున్నారు. ఇందులో భాగంగా… టీడీపీ – బీజేపీ మధ్య అనుబంధానం చేస్తున్నాడని.. ఈ మధ్యవర్తిత్వం అస్సలు మంచిది కాదని నారాయణ పవన్ కు సూచించారు.
అనంతరం… పవన్ రాజకీయాలు చేయడానికి వచ్చినట్లు కనిపించట్లేదని సందేహం వ్యక్తం చేసిన నారాయణ… నిన్న తనకు చెగువేరా ఆదర్శమని, ఆయనలా డ్రెస్సులు వేసుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు మితవాదులైనటువంటి సావర్కర్ గా మారిపోయాడని అన్నారు. ఇక రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకునేందుకు సిద్ధమవుతాడేమో అంటూ ఎద్దేవా చేశారు.
దీంతో ఆన్ లైన్ వేదికగా పవన్ ఫ్యాన్స్ నారాయణను టార్గెట్ చేశారు. ఆయనపై రకరకాల పోస్టులు పెడుతూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మీంస్ క్రియేట్ చేస్తూ ఒక ఆటాడుకునే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా పవన్ అభిమానుల చేష్టలపై నారాయణ స్పందించారు. సోషల్ మీడియాలో తనపై జనసేన దుష్ప్రచారం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.
టీడీపీ, బీజేపీ మధ్య సంధానకర్తగా పవన్ వ్యవహరించొద్దని మరోసారి సూచించారు నారాయణ. పవన్ గతంలో చేగువేరా డ్రెస్ వేసుకునేవారని గుర్తు చేశారు. ఇదే సమయంలో వామపక్ష భావజాలం ఉన్న పుస్తకాలు చదివే పవన్… నేడు బీజేపీతో కలవడం నిలకడలేని రాజకీయంగా ఆయన అభివర్ణించారు. ఇలా చెబుతున్న తనపై సోషల్ మీడియాలో జనసేన దుష్ప్రచారం చేసినంత మాత్రాన తనకేమీ కాదని ఆయన తేల్చి చెప్పారు.
కాగా… ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంకోసం హస్తిన వెళ్లిన పవన్ కల్యాణ్ వరుసపెట్టి బీజేపీ నేతలను కలిసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్, కేంద్ర మంత్రి మురళీధరన్ ను కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం హోమంత్రి అమిత్ షాను కలిసిన ఆయన… ఫైనల్ గా నడ్డాను కలిసి వచ్చారు.