బిగ్ బ్రేకింగ్ : మహా కూటమిలో ఆ రెండు పార్టీలకు పొగ

తెలంగాణలో మహా కూటమి ఇచ్చుకపోయే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. కూటమిలో పెద్దన్న కాంగ్రెస్ కు చిన్న పార్టీల పట్ల మరీ చిన్నచూపు ఉందని, వాళ్లు ఉంటే ఎంత? పోతే ఎంత అన్నట్లు వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన మహా కూటమి పరిస్థితి ఆదిలోనే హంసపాదులా తయారైంది. అసలు నాలుగు పార్టీల కూటమి ఉంటదా లేక ద్విపార్టీ కూటమిగా మారుతుందా అన్న టెన్షన్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొంది. 

బాబు సమక్షంలో టిడిపిలో చేరిన హీరోయిన్ రేవతి చౌదరి

తెలంగాణలో మహా కూటమిగా నాలుగు పార్టీలు జట్టు కట్టబోతున్నాయి. అందులో పెద్ద పార్టీలు కాంగ్రెస్, టిడిపి కాగా చిన్న పార్టీలుగా తెలంగాణ జన సమితి, సిపిఐ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్న వాటిలో టిడిపిని గౌరవిస్తున్నది. టిడిపి కాంగ్రెస్ ను గౌరవిస్తున్నది కానీ మిగతా రెండు పార్టీలను కాంగ్రెస్ గౌరవిస్తలేదు. టిడిపి గౌరవిస్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కూటమి నుంచి సిపిఐ, తెలంగాణ జన సమితి పోతే పీడ పోతుంది అన్నట్లు కాంగ్రెస్ వ్యవహారం ఉన్నట్లు కనబడుతున్నది.

తెలంగాణలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా కసిగా ఉన్న పార్టీల్లో సిపిఐ, తెలంగాణ జన సమితి ముందు వరుసలో ఉంటాయి. ఎలాగైనా టిఆర్ఎస్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో ఈ పార్టీలు ఉన్నాయి. అందుకే కూటమి దిశగా సిపిఐ అందరికంటే ముందు ప్రయత్నం చేసింది. తెలంగాణ జన సమితి కూడా కూటమికి జై కొట్టింది. కానీ కూటమిలో ఉన్న పెద్దన్న కాంగ్రెస్ ఈ రెండు పార్టీలను లెక్క చేస్తలేదు. అడిగినన్ని సీట్లు లేవు, అడిగిన నియోజకవర్గం లేదు. గౌరవం లేని కూటమిలో ఉండాలా గుడ్ బై చెప్పాలా అన్న మీమాంసలో సిపిఐ, తెలంగాణ జన సమితి ఉన్నాయి.

కూటమిలో జన సమితి 36 సీట్లు అడిగింది. కానీ కాంగ్రెస్ 8 లేదా 9 కి అయితే ఇస్తామని ప్రతిపాదించింది. అది జన సమితి అడిగిన సీట్లు కాకుండా తనకు నచ్చిన సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీ అయింది. అయితే కనీసం 15 నుంచి 17 సీట్లు ఇస్తే కూటమిలో ఉండాలి.. లేదంటే నమస్కారం పెట్టి వెళ్లిపోవాలని జన సమితి ఆలోచనలో ఉంది. ఆ సీట్లలో కూడా అడిగిన స్థానాలే ఇవ్వాలనేది జన సమితి డిమాండ్. మరో రెండు రోజుల్లో పార్టీ కార్యవర్గ సమావేశంలో తాడో పేడో తేల్చేస్తామని జన సమితి హెచ్చరించింది.

ఇక సిపిఐ కూడా 8 నుంచి 10 సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నది. అందులో కూడా తగ్గించే ఆలోచన చేస్తే మటుకు సొంతంగానే పోటీ చేయాలన్న ఆలోచనలో ఉంది. నిన్న సిపిఐ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరీ దిగజారి 3 సీట్లలో పోటీ చేయలేమని, ఆ మూడు సీట్లు సొంతంగా పోటీ చేసినా తాము సంపాదించుకోగలమని సిపిఐ ఆలోచనలో ఉంది. ఎట్లాగూ కూటమిలో చేరినం కదా అని అవమానకరంగా చూస్తే ఉండాల్సిన అవసరం ఏముందని సిపిఐ నేతలు అంటున్నారు. సొంతంగా అయితే తమకు బలమున్న 25 స్థానాల్లో పోటీ చేయొచ్చని ఆలోచిస్తున్నారు.

అన్ని పార్టీలను గౌరవించాల్సిన కాంగ్రెస్ పార్టీ అవమానాలకు గురి చేయడం, జనాల్లో చిన్నచూపు ఏర్పడేలా మీడియాకు లీకులు ఇవ్వడం పట్ల ఈ రెండు పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి. సీట్ల సంఖ్య కంటే వారి అవమానాలు భరించలేకపోతున్నామని జన సమితి నేత ఒకరు చెప్పారు. అయితే టిడిపి పట్ల కాంగ్రెస్ మంచిగా నడుచుకుంటుందని తెలుస్తోంది. ఎందుకంటే టిడిపి ఎపిలో అధికారంలో ఉంది. ఇక్కడ బలమైన కేడర్ ఉంది. అంతేకాకుండా టిడిపికి బలమైన బిసి ఓటు బ్యాంకు తెలంగాణలో ఇంకా పటిష్టంగా ఉంది. ఎలాగైనా టిడిపి బిసి ఓటు బ్యాంకుతో అధికారంలోకి రావొచ్చని కాంగ్రెస్ అంచనాల్లో ఉంది. ఆ మాటకొస్తే టిజెఎస్, సిపిఐ పార్టీల ఓటు బ్యాంకేమీ తమకు పెద్దగా అక్కరకు రాదన్న భావనలో కాంగ్రెస్ ఉంది.

ఇక తెలంగాణలో పొత్తులపై చంద్రబాబు ఒక ప్రకటన చేశారు. ‘‘మనకు సీట్ల సంఖ్య ముఖ్యం కాదు. గెలిచే స్థానాలను ఎంచుకుని పోటీ చేద్దాం. పొత్తులు ముఖ్యం తప్ప సీట్లు ముఖ్యం కాదు. జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులను పరిగణలోకి తీసుకోవాలి. అందరికీ అవకాశాలు రాకపోవచ్చు.. సర్దుకుపోవాలి. మరీ సిపిఐ, తెలంగాణ జన సమితిలాగా మనం కాంగ్రెస్ ను బదనాం చేయడం కరెక్టు కాదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

 

దీన్నిబట్టి అటు ఇటు కాంగ్రెస్, అటు టిడిపి రెండు పార్టీలు కలిసి ఆ రెండు పార్టీలకు ఘాటైన పొగ పెడుతున్నట్లు తెలుస్తోంది. మరి మహా కూటమి నాలుగు పార్టీల కూటమిగానే ఉంటుందా? రెండు పార్టీల కూటమిగా మారుతుందా అన్నది అతి త్వరలోనే తేలనుంది.