జగన్ పై హత్యాయత్నం : రోడ్డున పడిన చంద్రబాబు పరువు

ఢిల్లీ సాక్షిగా వైసిపి నేతలు చంద్రబాబునాయుడు పరువును తీసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నానికి సంబంధించి చంద్రబాబు ఒంటెత్తు పోకడులను వైసిపి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  మొన్న 25వ తేదీన హైదరాబాద్ కు వచ్చేందుకు జగన్ విశాఖపట్నం విమానాశ్రయంలో ఉన్నపుడు ఓ యువకుడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. చివరి నిముషంలో ప్రమాదాన్ని గ్రహించిన జగన్ పక్కకు తిరగటంతో గొంతులో దిగాల్సిన కత్తి ఎడమభుజం క్రింద దిగింది. అప్పటి నుండి రెండు వైపుల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దాడి జరగ్గానే డిజిపి, మంత్రలు, చంద్రబాబు అంతా డ్రామాగా కొట్టిపాడేశారు. తర్వాత విచారణ పేరుతో సిట్ ను ఏర్పాటు చేశారు. జరిగిన దాడిని ముఖ్యమంత్రే స్వయంగా డ్రామాగా కొట్టేయటంతో ఇక సిట్ వేసినా వాస్తవాలు బయటకు రావని వైసిపి నేతలు భావించారు. అందుకనే థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా చంద్రబాబు వైసిపి నేతల మాటలను లెక్క చేయటం లేదు. అందుకనే జరిగిన ఘటనపై వైసిపి నేతలు డిల్లీకి వెళ్ళి వివిధ జాతీయపార్టీల నేతలు సీతారం ఏచూరి, శరద్ పవార్, శరద్ యాదవ్ తదితరులను కలిశారు.

విమానాశ్రయంలో జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని, జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు  చేస్తున్న కుట్రను వివరించారు. తమ వాదనకు మద్దతుగా కుట్ర సూత్రదారుడు చంద్రబాబే అన్న తమ అనుమానానికి ఆధారాలను కూడా జాతీయ నేతల ముందుంచినట్లు సమాచారం. చంద్రబాబు వ్యక్తిత్వం,  చేసే రాజకీయాల గురించి జాతీయ పార్టీల నేతలకు కొత్తగా వైసిపి చెప్పాల్పిన అవసరం లేదు. హత్యాయత్నం ఘటనపై డిజిపి, మంత్రులు, చంద్రబాబు ప్రకటనలను జాతీయ పార్టీల నేతలకు వివరించారు. వివిధ పార్టీల అధ్యక్షులు కూడా జగన్ పై హత్యాయత్నం జరిగినట్లు కన్వీన్స్ అయినట్లు తెలిసింది.

హత్యాయత్నం కుట్రకు కేంద్రప్రభుత్వ పరిధిలో ఉండే విమానాశ్రయాన్నే ఎందుకు ఎంచుకున్నారు అన్న విషయాన్ని కూడా వైసిపి నేతలు వివరించారట. హత్య జరిగుంటే సమస్యంతా బిజెపిపైకి వెళ్ళేట్లు, మిస్సయితే సానుభూతి కోసం తనపై తానే జగన్ హత్యాయత్నం చేసుకున్నాడని ప్రచారం చేయాలన్న చంద్రబాబు ఆలోచనను ఎండగట్టారట. మొత్తం మీద హత్యాయత్నం ఘటన ద్వారా టిడిపి, వైసిపిలకు వచ్చిన లాభం ఏంటో తెలీదు కానీ చంద్రబాబు మత్రం బాగా బద్నామయ్యారు. ఎందుకంటే, ఒకవైపు జరిగిన ఘటన డ్రామా అన్న టిడిపి ఆరోపణలు తేలిపోతోంది. మరోవైపు జరిగింది నిజంగా హత్యాయత్నమే అనటానికి వైసిపి నేతలు చూపిస్తున్న ఆధారాలే గట్టిగా ఉన్నాయి. దాంతో చంద్రబాబు పరువు ఢిల్లీ వీధుల్లో పడిందనే  చెప్పాలి.