అదిగదిగో కరోనా మూడో వేవ్.. వచ్చేస్తోంది, జర జాగ్రత్త.. అంటూ సాక్షాత్తూ ఐసీఎంఆర్ అప్రమత్తం చేస్తోంది దేశ ప్రజల్ని. నిజానికి, జులై చివర్లోనే మూడో వేవ్ మొదలైపోయిందన్న ప్రచారం జరిగింది. కాదు కాదు, ఆగస్టులో మూడో వేవ్ పతాక స్థాయికి చేరుతుందని అంచనా వేశారు. ఆగస్ట్ కూడా పూర్తయిపోయింది. సెప్టెంబర్ నెలలోకి వెళుతున్నాం. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మూడో వేవ్ తీవ్ర ప్రభావం చూపబోతోందన్నది ఐసీఎంఆర్ తాజా అంచనా. ఇంకెవరో చెబితే, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని వుండేది కాదేమో. ఐసీఎంఆర్ చెబుతోందంటే, ఒకింత అప్రమత్తంగా వుండి తీరాల్సిందే. కేరళలో కరోనా ఉధృతి అస్సలు తగ్గడంలేదు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మాత్రం కరోనా పరిస్థితి ఒకింత మెరుగ్గానే వుంది. తెలంగాణ చాలా బెటర్ పొజిషన్‌లో వుంటే, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త కంగారు పెడుతున్నాయి.
మూడో వేవ్ వస్తే పరిస్థితేంటి.? భారతదేశం తట్టుకోగలదా.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి. ఇదిలా వుంటే, దక్షిణాఫ్రికాలో కోవిడ్ 19 కొత్త వేరియంట్ కనుగొనబడిందనీ, అది వ్యాక్సిన్లకు లొంగడంలేదనీ పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్న విషయం విదితమే. ఆ వేరియంట్ గనుక ప్రపంచం మీద దాడి చేస్తే.. ఆ వేవ్ ఇంకెలా వుండబోతోందో.? డెల్టా వేరియంట్ దెబ్బకి ప్రపంచ దేశాలన్నీ గడగడా వణకాల్సి వచ్చింది. ఆ డెల్టా వేరియంట్ వ్యవహారాన్నే సెకెండ్ వేవ్ అంటూ వచ్చాం. దానికి తోడుగా మరికొన్ని వేరియంట్ల గురించి ప్రచారమైతే జరిగిందిగానీ.. అవేవీ అంతగా భారతదేశంలో కనిపించలేదు. ఇప్పుడిప్పుడే ప్రపంచంలోని పలు దేశాలు కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల సంగతి తర్వాత.. భారతదేశంలోని మిగతా రాష్ట్రాల సంగతి తర్వాత. మూడో వేవ్ వస్తే.. తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటో.? అసలే స్కూళ్ళు రగడ నడుస్తోందాయె ఇక్కడ.