కొత్త భయాలు.! వైసీపీలో కోవర్టులున్నారా.?

ఏ రాజకీయ పార్టీలో అయినా కోవర్టులు మామూలే.! వైసీపీ ఇందుకు అతీతం ఏమీ కాదు. వైసీపీకి 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ వచ్చాక, అధినాయకత్వాన్ని ధిక్కరించడమంటే ఎవరైనా రిస్క్ చేయాల్సిందే. రఘురామకృష్ణరాజు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి.. ఇలా వేళ్ళ మీద లెక్కబెట్టేంత తక్కువమంది ఎంత గింజుకున్నా.. వైసీపీకి పెద్దగా నష్టం వుండదు.

నిజానికి, తమ నైజాన్ని బయటపెట్టేసుకునేవారితో సమస్య వుండదు. వైసీపీలోనే అణిగిమణిగి వుంటూ, అధినాయకత్వానికి అన్నిట్లోనూ వత్తాసుపలుకుతూ, సమయం చిక్కినప్పుడు వెన్నుపోటు పొడిచేవారితోనే అసలు సమస్య. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధినాయకత్వానికి వెన్నుపోటు పొడిచారు కొందరు కీలక నేతలు. సీనియర్లుగా చెప్పబడుతున్న కొందరు నాయకులే, వైసీపీని దెబ్బేశారన్నది వైసీపీలో అంతర్గతంగా వినిపిస్తోన్న వాదన. అయితే, ఈ విషయమై వైఎస్ జగన్ ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేకపోతున్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాక.. మొత్తంగా ఒకేసారి ‘ప్రక్షాళన’ చేపట్టే దిశగా వైఎస్ జగన్ వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, అధినాయకత్వానికి తమ సన్నిహితుల ద్వారా ఝలక్ ఇచ్చేందుకు కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నించారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

క్యాంపు రాజకీయాలతో అలాంటి కోవర్టుల్ని తాత్కాలికంగా అధినాయకత్వం కూల్ చేయక తప్పలేదు. అయితే, ముందు ముందు అలాంటోళ్ళందరికీ చుక్కలు తప్పవట. వాళ్ళెవరు.? ఏంటా కథ.? కోవర్టుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి కాబోతోంది.? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.